Chandrababu: దోపిడీ దొంగల సంస్కృతిలోకి రాష్ట్ర పోలీసులు వెళ్లడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది: చంద్రబాబు

  • ధరణికోటలో ఇద్దరి అరెస్ట్
  • పోలీసులు అర్ధరాత్రి గోడలు దూకి వెళ్లారన్న చంద్రబాబు
  • ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం బరితెగిస్తున్నారని ఆగ్రహం
  • పోలీసులు మూల్యం చెల్లించుకుంటారని స్పష్టీకరణ
Chandrababu slams police after they arrested two persons in midnight

అమరావతి మండలం ధరణికోటకు చెందిన వెంకటేశ్ అనే సామాన్య యూట్యూబ్ చానల్ నిర్వాహకుడిని, మరో వ్యక్తి సాంబశివరావును పోలీసులు అర్ధరాత్రి ఇంటిపై పడి అరెస్ట్ చేయడం దారుణమని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అర్ధరాత్రి వేళ గోడలు దూకి వెళ్లడం, గునపాలతో గొళ్లెం పగలగొట్టి ఇళ్లలోకి చొరబడడం, ఇంట్లోని మనుషుల్ని ఎత్తుకెళ్లడం వంటి దోపిడీ దొంగల సంస్కృతిలోకి రాష్ట్ర పోలీసులు వెళ్లడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోందని తెలిపారు. 

ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించడం నేరమేమీ కాదని, కానీ అరెస్ట్ సమయంలో పోలీసులు లైట్లు పగలగొట్టి చీకట్లో చేసిన విధ్వంసమే నిజమైన నేరమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ పెద్దల మన్నన కోసం బరితెగిస్తున్న పోలీసు అధికారులు తప్పక మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. అయినా, ప్రభుత్వ అసమర్థ పాలనపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తే అరెస్ట్ చేస్తారా? వాళ్లేమైనా ఖూనీకోరులా? తీవ్రవాదులా? అంటూ మండిపడ్డారు. 

సీఐడీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన వెంకటేశ్, సాంబశివరావులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. కోర్టులు హెచ్చరించినా పట్టించుకోకుండా, అతిపోకడలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్న పోలీసులు కచ్చితంగా తమ చర్యలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు, దీనికి సంబంధించిన వీడియోను కూడా చంద్రబాబు పంచుకున్నారు.

More Telugu News