ఇడుపులపాయ‌లో గ్రామ స‌చివాల‌యానికి తాళం!... కార‌ణ‌మేంటంటే..!

grama sachivalayam in idupulapaya locked by the ysrcp leaders
  • ఆర్బీకే ఏర్పాటుపై వైసీపీలోని రెండు వ‌ర్గాల మ‌ధ్య భిన్నాభిప్రాయాలు
  • ఇడుపుల‌పాయ‌లోనే ఆర్బీఏ ఏర్పాటు చేయాల‌న్న ఓ వ‌ర్గం
  • వ‌ర్షానికి మునిగే ప్రాంతంలో ఆర్బీకే వ‌ద్దన్న మ‌రో వ‌ర్గం
కడప జిల్లా ఇడుపుల‌పాయ‌లోని గ్రామ స‌చివాల‌యానికి అధికార పార్టీ శ్రేణులే తాళాలు వేశారు. గ్రామానికి చెందిన వైసీపీలో రెండు వ‌ర్గాలు ఉండ‌గా... ఓ వ‌ర్గం శ్రేణులు గ్రామ సచివాల‌యానికి తాళం వేసి అక్క‌డే ధ‌ర్నాకు దిగారు. ప్ర‌త్యర్థి వ‌ర్గంతో వారు వాదులాట‌కు దిగారు. త‌ద‌నంత‌రం ఇరు వ‌ర్గాల మ‌ధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి ఇరు వర్గాల‌ను చెద‌ర‌గొట్ట‌డంతో ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగింది.

ఈ ఘ‌ట‌న‌కు దారి తీసిన వివ‌రాల్లోకెళితే... ఇడుపుల‌పాయ‌లో రైతు భ‌రోసా కేంద్రం (ఆర్బీకే) ఏర్పాటుకు సంబంధించి గ్రామ వైసీపీ శాఖ‌లోని రెండు వర్గాల మ‌ధ్య భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇడుపుల‌పాయ‌లో గ్రామ స‌చివాల‌యం స‌మీపంలోనే ఆర్బీకేను ఏర్పాటు చేయాల‌ని ఓ వ‌ర్గం వాదించింది. అయితే వ‌ర్షం ప‌డితే ఆ ప్రాంతం నీట మునుగుతుంద‌ని, అలాంటి ప్రాంతంలో ఆర్బీకే ఏర్పాటు వ‌ద్ద‌ని ఇంకో వ‌ర్గం వాదించింది. ఈ సంద‌ర్భంగా ఇరు వ‌ర్గాల మ‌ధ్య మాటామాటా పెరిగి వివాదం చెల‌రేగింది. అనంత‌రం వైంపల్లె జ‌డ్పీటీసీ ర‌వికుమార్ రెడ్డి వ‌ద్ద ఇరు వ‌ర్గాలు పంచాయితీ పెట్టాయి.
Go Back to Shorts
YSRCP
YS Jagan
Idupulapaya
Kadapa District
RBK

More Telugu News