Women: అమెరికాలో ఫోన్ల నుంచి పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్! 

  • ఇటీవలి ఓ కేసులో అక్కడి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మారిన పరిణామాలు
  • తమ పీరియడ్స్, గర్భధారణ సమాచారంపై మహిళల్లో ఆందోళన
  • అందుకే యాప్స్ తొలగింపు
Women in the US are deleting period tracking apps from their phone why

అమెరికాలో మహిళలు తమ స్మార్ట్ ఫోన్ల నుంచి నెలసరి సమాచారం నమోదు చేసే యాప్స్ ను (పీరియడ్ ట్రాకర్ యాప్) తొలగిస్తున్నారు. గత వారం ఓ కేసులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. పీరియడ్ ట్రాకర్ యాప్స్ లో నమోదయ్యే తమ పీరియడ్స్ సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు పొందగలవని వారికి  అర్థమైంది. ఈ డేటా ఆధారంగా అబార్షన్ సేవలను పొందే వారిని గుర్తించడం సులువు అవుతుంది. ఈ భయంతోనే అక్కడి మహిళలు తమ ఫోన్ల నుంచి పీరియడ్ ట్రాకర్ యాప్స్ తొలగిస్తున్నారు.

పీరియడ్ ట్రాకర్ యాప్స్ సంపాదించే డేటాను ఇతర సంస్థలకు, అబార్షన్ సేవలపై దర్యాప్తు చేసే సంస్థలతో పంచుకునే ప్రమాదం ఉందని నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది మహిళలు ట్విట్టర్ వేదికగా పీరియడ్ ట్రాకర్ యాప్స్ డిలీట్ చేసినట్టు పోస్ట్ లు పెడుతున్నారు. ముందు యాప్ లోని తమకు సంబంధించి మొత్తం డేటాను డిలీట్ చేసిన తర్వాతే.. యాప్ ను కూడా తొలగిస్తున్నారు. 

దీంతో ‘ఫ్లో’అనే పీరియడ్ ట్రాకింగ్ యాప్ కొత్తగా అనానిమస్ మోడ్ ను తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. తమ సమాచారాన్ని మరెవరూ పొందకుండా యాప్ ను ఉపయోగించుకోవచ్చని ప్రకటించడం గమనార్హం. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, టెస్లా కంపెనీలు తమ ఉద్యోగులకు ప్రత్యేక చెల్లింపులు చేయనున్నట్టు ప్రకటించాయి. తమ ఉద్యోగులు అబార్షన్ (గర్భస్రావం) నిషేధం లేని రాష్ట్రానికి వెళ్లేందుకు అయ్యే ఖర్చులను చెల్లించనున్నట్టు తెలిపాయి. 

ప్రతి నెలా ఏ తేదీన పీరియడ్ వచ్చిందన్న వివరాలు యాప్ లో నమోదవుతాయి. ఆలస్యమైతే ఆ వివరాలు కూడా ఉంటాయి. ఒకవేళ గర్భం దాల్చితే పీరియడ్ రాదు. యాప్ లోని సమాచారాన్ని విశ్లేషిస్తే ఇటువంటి వాస్తవాలు అన్నీ బయటకు వస్తాయి.

More Telugu News