North Karnataka: బెంగళూరు సిటీ పని అయిపోయింది: కర్ణాటక మంత్రి ఉమేశ్ కత్తి

North Karnataka state will be formed says Karnataka state
  • బెంగళూరులో ట్రాఫిక్ పరిస్థితి దారుణంగా ఉందన్న మంత్రి 
  • మోదీ కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయబోతున్నారని వెల్లడి 
  • ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం ఖాయమన్న ఉమేశ్ 
ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రం చేయాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా ఈ అంశంపై కర్ణాటక రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఉమేశ్ కత్తి మాట్లాడుతూ... ఉత్తర కర్ణాటక ఎప్పటికైనా ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తుందని చెప్పారు. 2024 ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ కొన్ని కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయబోతున్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా, మహారాష్ట్రను మూడు రాష్ట్రాలుగా, కర్ణాటకను రెండు రాష్ట్రాలుగా విభజించనున్నారని చెప్పారు. 

మన దేశంలో మొత్తం 50 రాష్ట్రాలు ఉండబోతున్నాయని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన చర్చ కూడా జరుగుతోందని చెప్పారు. బెంగళూరు సిటీ పని అయిపోయిందని అన్నారు. తన ఇంటి నుంచి విధాన సౌధకు 10 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉందని... కానీ, అక్కడకు వెళ్లడానికి గంటన్నరకు పైగా సమయం పడుతుందని చెప్పారు. బెంగళూరులో ట్రాఫిక్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో ఐటీ, బీటీ, పరిశ్రమలు పెరిగి తాగునీటి సమస్య కూడా తలెత్తవచ్చని చెప్పారు.
North Karnataka
Special State
Bengaluru

More Telugu News