Andhra Pradesh: మా అనుమతి లేకుండా ప్రజాప్రతినిధులపై కేసుల ఎత్తివేత కోర్టు ధిక్కరణే: రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఏపీ హైకోర్టు

  • ప్రజాప్రతినిధులపై కేసులు ఎత్తివేస్తూ జీవోలు ఇస్తున్న ప్రభుత్వం
  • సుప్రీం ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తే అన్ని కేసుల్లోనూ స్టే ఇస్తామని హెచ్చరిక
  • ప్రభుత్వ జీవోను సవాలు చేసిన ఏపీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు కృష్ణాంజనేయులు
AP High Court Warns State Government on Cases Against MPs and MLas

ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులను ఇష్టానుసారం ఉపసంహరించుకుంటే కుదరదని, అది కోర్టు ధిక్కరణే అవుతుందని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తే కనుక రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉపసంహరణకు పెండింగులో ఉన్న అన్ని కేసుల్లోనూ స్టే ఇస్తామని హెచ్చరించింది. 

అంతేకాదు, కేసుల ఉపసంహరణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక ఇవ్వాలని హోంశాఖను ఆదేశిస్తూ విచారణను మూడు వారాలు వాయిదా వేసింది. హైకోర్టు అనుమతి లేకుండా మాజీ, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల ఎత్తివేత కుదరదని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఈ హెచ్చరికలు జారీ చేసింది.

జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై ఉన్న మొత్తం పది కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవో ఇవ్వగా, దానిని సవాలు చేస్తూ ఏపీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కాగా, ఉదయభానుతోపాటు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విడదల రజిని, మల్లాది విష్ణు, గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి, జక్కంపూడి రాజా, ఎంవీ ప్రతాప్ అప్పారావు, టీటీడీ చైర్మన్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ నేతలు సీహెచ్ ద్వారకారెడ్డి, విరూపాక్ష‌ి జయచంద్రారెడ్డిపై కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవోలు ఇచ్చింది.

16 సెప్టెంబరు 2020 నుంచి 25 ఆగస్టు 2021 మధ్య రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులపై ఎన్ని కేసుల ఉపసంహరణకు జీవోలు ఇచ్చారనే వివరాలను పరిశీలించేందుకు హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ వ్యాజ్యంతోపాటు కృష్ణాంజనేయులు దాఖలు చేసిన పిల్ కూడా నిన్న విచారణకు వచ్చింది. 

ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ తన వాదనలు వినిపిస్తూ.. డీజీపీ సూచనతోనే ఉదయభానుపై కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. హోంశాఖ తరపున మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేసుల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభించాం తప్పితే తుది దశకు చేరుకోలేదని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేస్తూ.. విచారణను మూడు వారాలపాటు వాయిదా వేసింది.

More Telugu News