RGUKT Basara: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి సబిత చర్చలు సఫలం.. నేటి నుంచి తరగతులకు హాజరు

  • వారం రోజుల ఆందోళనకు తెర
  • సమస్యలన్నింటినీ నెల రోజుల్లో పరిష్కరిస్తానని మంత్రి హామీ
  • సమస్యల పరిష్కారానికి రూ. 5.6 కోట్లు విడుదల చేస్తామన్న నిర్మల్ కలెక్టర్
  • రాతపూర్వక హామీ కోరిన విద్యార్థులు.. మంత్రిని తాను స్వయంగా చెబుతున్నానన్న సబిత
Minister Sabitha Negotiations with Basara IIIT Students Successes

సమస్యల పరిష్కారం కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వారం రోజులుగా చేస్తున్న ఆందోళనకు తెరపడింది. విద్యార్థులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు సఫలం కావడంతో గత అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో విద్యార్థులు తమ ఆందోళన విరమించారు. నేటి నుంచి తరగతులకు హాజరుకానున్నారు. సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా నెల రోజుల్లో పరిష్కరిస్తామని మంత్రి సబిత హామీ ఇచ్చారని, అందుకనే ఆందోళన విరమించినట్టు విద్యార్థులు తెలిపారు. సమస్యల పరిష్కరానికి వెంటనే రూ. 5.6 కోట్లు విడుదల చేస్తామని నిర్మల్ జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఆర్జీయూకేటీ ఇన్‌చార్జ్ వీసీ రాహుల్ బొజ్జా, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్, విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ట్రిపుల్ ఐటీకి చేరుకున్న మంత్రి సబిత విద్యార్థుల సమస్యలపై తొలుత అధికారులతో చర్చించారు. ఆ తర్వాత 20 మంది విద్యార్థులతో కూడిన స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్‌తో ఆడిటోరియంలో సమావేశమయ్యారు.

అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి. నెల రోజుల్లో సమస్యలన్నీ తీరుస్తానని మంత్రి ఈ సందర్భంగా విద్యార్థులకు హామీ ఇచ్చారు. అయితే, రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని విద్యార్థులు పట్టుబట్టారు. స్పందించిన సబిత.. మంత్రిని తాను స్వయంగా చెబుతున్నానని, ఇంకా ఎలాంటి హామీ కావాలని ఆమె ప్రశ్నించారు. అనంతరం బయటకు వచ్చిన విద్యార్థులు ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించారు. డిమాండ్లు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. నేటి నుంచి తరగతులకు యథావిధిగా హాజరవుతామని పేర్కొన్నారు.

More Telugu News