dinesh kartik: అతని వయసు కాదు.. ఆట చూసి మాట్లాడండి: గవాస్కర్

  • దినేశ్ కార్తీక్ పై దిగ్గజ క్రికెటర్ ప్రశంస
  • టీ20 ప్రపంచ కప్ లో ఆడించాలని సూచన
  • దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20లో కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్
Dont look at his age look at what he is doing admits gavaskar on dinesh kartik

భారత జట్టు సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. అద్భుత ఫామ్ లో ఉన్న కార్తీక్ ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్‌ లో పోటీ పడే భారత జట్టులో లేకుంటే తాను ఆశ్చర్యపోతానని చెప్పాడు. 

ధోనీ కంటే ముందు జాతీయ జట్టులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ నిలకడలేక అనేక సార్లు వేటు ఎదుర్కొన్నాడు. కానీ, ఇప్పుడు అతను కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్నాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌ లో అద్భుతంగా ఆడుతున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరఫున ఫినిషర్ గా మెప్పించి తిరిగి టీమిండియాలోకి వచ్చాడు. 

దక్షిణాఫ్రికాతో శుక్రవారం రాత్రి జరిగిన కీలకమైన నాలుగో టీ20లో కార్తీక్ మెరుపు బ్యాటింగ్ తో అర్ధ సెంచరీ చేసి భారత జట్టును గెలిపించి జట్టు సిరీస్ లో నిలిచేలా చేశాడు. కార్తీక్ బ్యాటింగ్ చూసి ముగ్ధుడైన గవాస్కర్ ప్రతీబాల్ కు కచ్చితంగా పరుగులు చేయాల్సిన సమయంలో క్రీజులోకి వచ్చిన అతను అంత ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడాడని కొనియాడాడు. 

ప్రస్తుతం కార్తీక్ వయసు ఎంత అని చూడకుండా వచ్చే ప్రపంచకప్ లో అతడిని కచ్చితంగా ఆడించాలని సూచించాడు. ‘కార్తీక్ వయస్సును చూడకండి, అతను ఏమి చేస్తున్నాడో చూడండి, టీ20 వరల్డ్ కప్ కోసం మెల్ బోర్న్ వెళ్లే విమానంలో అతను లేకపోతే మాత్రం అది చాలా ఆశ్చర్యం’ అని గవాస్కర్ పేర్కొన్నాడు.

More Telugu News