Revanth Reddy: మోదీని సంతృప్తి పరిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ శ్రేణులపై దాడులు చేయించింది: రేవంత్ రెడ్డి

Revanth Reddy alleges state govt launched attacks on Congress cadre on Center orders
  • రాహుల్ గాంధీపై ఈడీ విచారణ
  • దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు
  • హైదరాబాదులోనూ కదంతొక్కిన కాంగ్రెస్ శ్రేణులు
  • పార్టీ అగ్రనేతల అరెస్ట్
హైదరాబాదులో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిరసనల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రాజ్ భవన్ కు తరలివెళ్లేందుకు యత్నించిన కాంగ్రెస్ నేతలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీలు రేణుకా చౌదరి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులను అరెస్ట్ చేశారు. కాగా, బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

కేంద్రాన్ని సంతృప్తి పరిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ శ్రేణులపై దాడులు చేయించిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రహస్య ఆదేశాలతోనే తమ శాంతియుత ర్యాలీని పోలీసులు భగ్నం చేశారని, తద్వారా నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకునేందుకు యత్నించారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నాటి కాంగ్రెస్ సర్కారు ఇలాగే వ్యవహరించి ఉంటే కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉండేవాళ్లు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్, మోదీ ఇద్దరిదీ ఒకే బాట అని విమర్శించారు.

నేడు కాంగ్రెస్ శ్రేణులపై దాడులను నిరసిస్తూ, రేపు (శుక్రవారం) జిల్లా కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అటు, పోలీసుల లాఠీచార్జిలో గాయపడి ఆసుపత్రిపాలైన టీపీసీసీ అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ చామలను రేవంత్ రెడ్డి పరామర్శించారు. కిరణ్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Revanth Reddy
Congress
BJP
Narendra Modi
KCR

More Telugu News