Bharat Ke Agniveer: యువకులకు 'అగ్నివీరులు'గా రక్షణశాఖలో ఉద్యోగాలు.. కొత్త పథకం ఆవిష్కరణ

  • స్వల్పకాలం పాటు సేవలు అందించే అవకాశం
  • 17.5-21 ఏళ్లలోపు వారికి అర్హత
  • నాలుగేళ్ల తర్వాత రెగ్యులర్ కేడర్ కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు
  • ప్రకటించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
Bharat Ke Agniveer Centre unveils new defence recruitment

రక్షణ దళాల్లో చేరి దేశానికి స్వల్ప కాలం పాటు యువత సేవలు అందించేందుకు వీలుగా రక్షణ శాఖ ఒక చక్కని అవకాశాన్ని తీసుకొచ్చింది. ‘భారత్ కే అగ్నివీర్ పేరు’తో ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది. నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీలో నాలుగేళ్ల పాటు సేవలు అందించే స్వల్పకాల పథకం ఇది. దీని వివరాలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిద దళాల అధిపతులతో కలసి ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించారు. అగ్నిపథ్ పథకాన్ని ఆమోదిస్తూ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. 

సాయుధ దళాలకు యువ రూపాన్ని కల్పించేందుకు ఈ పథకం కింద చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి చెప్పారు. యువతకు కొత్త సాంకేతికతలపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. వివిధ రంగాల్లో భిన్న నైపుణ్యాలున్న వారికి ఈ పథకం ఉపాధి అవకాశాలను కల్పిస్తుందన్నారు. 

‘‘అఖిల భారత స్థాయిలో ప్రతిభ ఆధారంగా నియామకాలు ఉంటాయి. 17.5 నుంచి 21 ఏళ్ల వయసులోపు వారిని చేర్చుకోవాలని అనుకుంటున్నాం. ఒక్కసారి ఎంపికైతే అగ్నివీర్స్ నాలుగేళ్లపాటు సేవలు అందిస్తారు’’ అని సైనిక దళాల అడిషనల్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి తెలిపారు. 

  • ఈ పథకం కింద యువతీ, యువకులకు సైనిక దళాల్లో చేరే అర్హత ఉంటుంది. వయసు 17.5-21 మధ్య ఉండాలి.
  • ప్రస్తుతం సైనిక దళాల్లో చేరేందుకు ఉన్న శారీరక సామర్థ్యం, వైద్య అర్హతలే వర్తిస్తాయి. 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణులైన వారిని తీసుకుంటారు. 
  • అగ్నివీర్స్ కు ఏటా 4.76 లక్షలు మొదటి ఏడాది చెల్లిస్తారు. రెండో ఏడాది నుంచి రూ.6.92 లక్షలు చెల్లిస్తారు. 
  • పలురకాల అలవెన్స్ లు కూడా లభిస్తాయి. నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత రూ.11.7 లక్షలు చెల్లిస్తారు. ఈ మొత్తంపై పన్ను ఉండదు. 
  • నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత రెగ్యులర్ కేడర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరాలు, అర్హతలను బట్టి 25 శాతం మందిని తీసుకుంటారు.

More Telugu News