Covid Test: విదేశీ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షల నిబంధన ఎత్తివేసిన అమెరికా

  • మునుపటితో పోల్చితే తగ్గిన కరోనా వ్యాప్తి
  • నిబంధనలు సడలిస్తోన్న బైడెన్ ప్రభుత్వం
  • కొవిడ్ టెస్టుతో సంబంధం లేకుండా అమెరికా వచ్చేయొచ్చని వెల్లడి
US lifts covid tests mandate to foreign travelers

కరోనా మహమ్మారి కారణంగా అత్యధిక ప్రాణనష్టం చవిచూసిన దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా ఒకటి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికా కూడా కఠిన ఆంక్షలు విధించింది. అయితే, మునుపటితో పోల్చితే కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షల నిబంధనను ఎత్తివేసింది. 

ఇకపై అమెరికా వచ్చేవారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదని సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. ఈ నిబంధన ఆదివారం నుంచి తొలగిపోనుందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అయితే ప్రతి 90 రోజలకు ఒకసారి పరిస్థితిని సమీక్షిస్తామని, ఒకవేళ కరోనా కొత్త వేరియంట్లు ఏమైనా విజృంభిస్తే కరోనా పరీక్షల నిబంధనను మళ్లీ తీసుకువస్తామని వివరించారు. 

మొదట్లో, రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నవారు తమ ప్రయాణ తేదీకి ముందు మూడ్రోజుల్లో ఎప్పుడైనా కరోనా పరీక్షలు చేయించుకుని, అందులో నెగెటివ్ వచ్చినట్టుగా సర్టిఫికెట్ సమర్పిస్తేనే అమెరికాలోకి అనుమతించేవారు. అదే సమయంలో, వ్యాక్సిన్ తీసుకోని వారు తమ ప్రయాణానికి ఒక్కరోజు ముందు కరోనా పరీక్ష చేయించుకుని, నెగెటివ్ వస్తేనే అమెరికా వచ్చేందుకు అనుమతించేవారు. 

అయితే, ఒమిక్రాన్ వేరియంట్ విజృంభించిన నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వ యంత్రాంగం గత నవంబరులో నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్నవారు, తీసుకోని వారు అనే తేడా లేకుండా, ఎవరైనా అమెరికా రావాలనుకుంటే ప్రయాణానికి ఒకరోజు ముందు కరోనా టెస్టు చేయించుకుని, నెగెటివ్ వస్తేనే అనుమతి ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఏమంత తీవ్రస్థాయిలో లేకపోవడంతో నిబంధనలను సడలిస్తోంది.

More Telugu News