Andhra Pradesh: కోనసీమ పంట విరామ పాపం వైసీపీదే: పవన్ కల్యాణ్

Pawan Writes to Government Over Konaseema Crop Holiday
  • ప్రభుత్వానికి బహిరంగ లేఖ
  • ధాన్యం అమ్మిన రైతులకు టైంకు డబ్బులివ్వలేదని ఆగ్రహం
  • 11 ఏళ్ల తర్వాత తాజాగా పంట విరామమన్న పవన్
  • రాత్రికి రాత్రే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులేసిందని విమర్శ
  • రైతులను విమర్శిస్తూ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్
కోనసీమ పంట విరామం విషయంలో ఏపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఆ పాపం వైసీపీదేనన్నారు. రాష్ట్రసర్కారు నిర్లక్ష్యం, చేసిన తప్పుల వల్లే అన్నపూర్ణ వంటి కోనసీమలో ఇవాళ పంట విరామం ప్రకటించే దుస్థితి దాపురించిందన్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన బహిరంగ లేఖ రాశారు. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బు చెల్లించడం లేదని, కాలువలు, డ్రెయిన్ల మరమ్మతులు, పూడికతీత, గట్లను పటిష్ఠం చేయడం వంటి వాటిపై ప్రభుత్వం శ్రద్ధ చూపించట్లేదని విమర్శించారు. 

రంగు మారిన ధాన్యానికి ధర ఇవ్వడం లేదన్నారు. ఈ ఇబ్బందులన్నింటినీ దృష్టిలో పెట్టుకునే రైతులు పంట వేయకూడదన్న నిర్ణయానికి వచ్చారని, అందులో భాగంగానే తొలకరి పంట వేయలేమంటూ ప్రభుత్వానికి రైతులు లేఖ రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితులు రావడం తీవ్ర విచారకరమన్నారు.  

2011లో ఒకసారి పంట విరామాన్ని ప్రకటించారని, అప్పుడు దాదాపు లక్షన్నర ఎకరాల్లో పంట పండించలేదని లేఖలో పవన్ గుర్తు చేశారు. ఆనాడు ఆ నిర్ణయం దేశం మొత్తాన్ని కుదిపేసిందని, రైతన్నల సమస్యలను తెలుసుకునేందుకు 13 జాతీయ పార్టీల నేతలు కోనసీమకు తరలివచ్చారని అన్నారు. అయితే, మళ్లీ ఇప్పుడు పంట విరామం వచ్చిందన్నారు. 

అల్లవరం, ఐ.పోలవరం, ముమ్మడివరం, ఉప్పలగుప్తం మండలాల్లోని 25 వేల ఎకరాలు, అమలాపురం రూరల్, మామిడికుదురు, కాట్రేనికోన, సఖినేటిపల్లి మండలాల్లో 20 వేల ఎకరాలు, కడియం మండలంలో వందల ఎకరాల్లో రైతులు పంట విరామం ప్రకటించారన్నారు. మొత్తంగా 50 వేల ఎకరాలకుపైగా క్రాప్ హాలిడే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 

రబీలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదని, దాదాపు రూ.475 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. పంట విరామం ప్రకటించడంతో రాత్రికి రాత్రే రైతుల ఖాతాల్లో రూ.139 కోట్ల జమ చేసిందని అన్నారు. క్రాప్ హాలిడే ప్రకటించిన మండలాల్లో సాగునీరు అందడం లేదన్నారు. 

కూలీల ధరలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో వ్యవసాయాన్ని జాతీయ ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయాలంటూ రైతులు కోరుతున్నారని, ఈ డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నా ఎందుకు కార్యరూపం దాల్చడం లేదని ప్రశ్నించారు. కాగా, పంట విరామం ప్రకటించిన రైతులపై వైసీపీ నేతలు చౌకబారు విమర్శలు చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. ఇసుక లేదని భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కితే వాళ్లనూ తిట్టారని, పదో తరగతి విద్యార్థులు ఫెయిలైతే ఆ నెపాన్ని తల్లిదండ్రులపైకి నెట్టారని మండిపడ్డారు. 

ఆడబిడ్డపై అత్యాచారం జరిగితే తల్లి పెంపకం లేదంటూ చౌకబారు కామెంట్లు చేశారని, ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చాలని ఉద్యోగులు రోడ్డెక్కితే వారిపైనా బాధ్యత లేదంటూ విరుచుకుపడ్డారని గుర్తు చేశారు. ఇలా ప్రతి సమస్యనూ వైసీపీ నేతలు రాజకీయ కోణంలోనే చూస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
Andhra Pradesh
Pawan Kalyan
Konaseema District
Crop Holiday

More Telugu News