Thar: గురువాయూరప్పకు బహూకరించిన థార్ వాహనానికి వేలంలో అదిరిపోయే ధర!

Thar vehicle belongs to Guruvayurappan temple garnered huge price in auction
  • ఆలయానికి థార్ వాహనం అందజేసిన మహీంద్రా
  • గత డిసెంబరులో తొలిసారి వేలం
  • ఒకే వ్యక్తి పాల్గొన్న వైనం
  • కోర్టును ఆశ్రయించిన హిందూ సేవా సంఘం
  • మరోసారి వేలం నిర్వహించాలని ఆదేశాలు
  • తాజా వేలంలో రూ.43 లక్షల ధర పలికిన థార్
మహీంద్రా సంస్థ ఉత్పత్తి చేసే వాహనాల్లో థార్ కు ప్రముఖ స్థానం లభిస్తుంది. ఎంతో చూడముచ్చటగా, దృఢంగా ఉండే థార్... జీప్ వాహనాన్ని తలపిస్తుంది. కాగా, ఈ థార్ వాహనాన్ని గతేడాది మహీంద్రా సంస్థ కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గురువాయూరప్ప ఆలయానికి బహూకరించింది. కానుక రూపంలో అందిన ఈ థార్ వాహనానికి తాజాగా నిర్వహించిన వేలంలో అదిరిపోయే ధర పలికింది. 

దీని కనీస ధరను రూ.15 లక్షలు అని వేలం సందర్భంగా ప్రకటించారు. ఈ వేలంలో దుబాయ్ వ్యాపారవేత్త విఘ్నేశ్ విజయకుమార్ రూ.43 లక్షలకు ఈ థార్ వాహనాన్ని సొంతం చేసుకున్నారు. అంతకుముందు, మంజూష అనే బిడ్డర్ రూ.40 లక్షలకు పాడినా, విఘ్నేశ్ విజయకుమార్ వేలం పాటను ఇంకాస్త పైకి తీసుకెళ్లారు. ఈ వేలంలో 15 మంది పాల్గొనగా చివరికి విజయకుమారే గురువాయూరప్ప థార్ వాహనాన్ని కైవసం చేసుకున్నారు.

వాస్తవానికి గతేడాది డిసెంబరు 18న ఈ థార్ వాహనానికి తొలిసారి వేలం నిర్వహించారు. ఆనాటి వేలంలో ఒకే ఒక్కరు పాల్గొనగా, రూ.15.10 లక్షలకు బహ్రెయిన్ పారిశ్రామికవేత్త అమల్ మహ్మద్ అలీ తరఫున ఆయన స్నేహితుడు సుభాష్ పణికర్ దక్కించుకున్నారు. అయితే, దీనిపై హిందూ సేవా సంఘం కోర్టును ఆశ్రయించింది. వేలంపాటకు సరైన ప్రచారం కల్పించడంలో విఫలమయ్యారని, అందుకే వేలంలో ఒక్క వ్యక్తే పాల్గొన్నాడని హిందూ సేవా సంఘం ఆరోపించింది. 

దాంతో కోర్టు ఆదేశాల మేరకు తాజాగా రెండోసారి వేలం నిర్వహించారు. ఈ థార్ వాహనాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ 2021 డిసెంబరు 4న గురువాయూరప్ప దేవస్థానానికి విరాళంగా ఇచ్చింది. ఈ వాహనం మార్కెట్ ధర రూ.17 లక్షల (ఆన్ రోడ్) వరకు ఉంటుంది.
Thar
Guruvayurappan Temple
Auction
Mahindra
Kerala

More Telugu News