KCR: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్.. దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచిందన్న సీఎం!

  • వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన కేసీఆర్
  • ఈ ఎనిమిదేళ్లలో ఎన్నో ఘన విజయాలను సాధించామన్న సీఎం
  • రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,78,833కి పెరిగిందని వ్యాఖ్య
KCR hoists national flag in Telangana formation day celebrations

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో రాష్ట్ర ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఎనిమిదేళ్ల అతి తక్కువ కాలంలోనే మనం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే ఎన్నో ఘన విజయాలు కళ్ల ముందు కనపడతాయని అన్నారు. రాష్ట్రం అవతరించే నాటికి... ఇప్పటి పరిస్థితులకు పోలికే లేదనేది అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. తాగు, సాగునీటి సదుపాయం, ప్రజాసంక్షేమం, పారశ్రామిక, ఐటీ రంగాలతో పాటు అనేక రంగాల్లో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. దేశానికే దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగిందని అన్నారు. 

కఠినమైన ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను పెంచుకున్నామని కేసీఆర్ చెప్పారు. 2014-19 వరకు 17.24 శాతం సగటు ఆర్థిక వృద్ధి రేటుతో దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో నిలిచిందని తెలిపారు. తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ రికార్డును సృష్టించిందని చెప్పారు. 2021-22 నాటికి తలసరి ఆదాయం రూ. 2,78,833కి పెరిగిందని తెలిపారు. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం రోజురోజుకూ పెరుగుతుండటం మంచి పరిణామమని చెప్పారు.

తెలంగాణ ఏర్పడిన నాడు రాష్ట్ర జీడీపీ రూ. 5,05,849 కోట్లుగా ఉండగా... ఇప్పుడు అది రూ. 11,54,860 కోట్లకు చేరిందని అన్నారు. పెరిగిన ఆదాయంలో ప్రతి పైసాను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తున్నామని చెప్పారు.

More Telugu News