Nara Lokesh: నారా లోకేశ్ పాదయాత్ర.. చంద్రబాబు జిల్లాల పర్యటనలు!

Nara Lokesh is going to take up Padayatra
  • సుదీర్ఘంగా ఏడాది పాటు పాదయాత్రను చేపట్టనున్న నారా లోకేశ్
  • రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సందర్శించేలా పాదయాత్ర రోడ్ మ్యాప్
  • ఒక్కో జిల్లాలో మూడు రోజుల పాటు మకాం వేయబోతున్న చంద్రబాబు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. పదేళ్ల క్రితం తన తండ్రి చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర స్ఫూర్తితో, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా లోకేశ్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపడమే లక్ష్యంగా ఆయన పాదయాత్ర కొనసాగనుంది. 

తన తండ్రి చంద్రబాబు పాదయాత్ర చేపట్టిన పదేళ్ల తర్వాత లోకేశ్ పాదయాత్రకు సిద్ధమవుతుండటం గమనార్హం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సందర్శించేలా... సుదీర్ఘంగా ఏడాది పాటు పాదయాత్ర కొనసాగించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 

ఈ క్రమంలో అక్టోబర్ 2వ తేదీన గాంధీజయంతి నాడు పాదయాత్రను ప్రారంభించాలని భావిస్తున్నట్టు సమాచారం. గతంలో చంద్రబాబు కూడా ఇదే తేదీన పాదయాత్రను ప్రారంభించారు. ఒకవేళ ముందస్తు ఎన్నికల సంకేతాలు ఉంటే... పాదయాత్ర ప్రారంభ తేదీ మరింత ముందుకు జరిగే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. 

మరోవైపు లోకేశ్ పాదయాత్రకు సమాంతరంగా జిల్లాల పర్యటన చేపట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ప్రతి జిల్లాలో మూడు రోజుల పాటు మకాం వేయాలని ఆయన భావిస్తున్నారు. కొత్త జిల్లాలు లేదా పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా ఆయన పర్యటనలు ఉండబోతున్నాయి. 

చంద్రబాబు పర్యటనల్లో తొలిరోజు మహానాడు పేరుతో విస్తృత స్థాయి పార్టీ సమావేశాలు ఉంటాయి. రెండో రోజు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో విడివిడిగా సమావేశమై చర్చలు జరుపుతారు. మూడో రోజు జిల్లాలోని ప్రధాన సమస్యలను ఎంపిక చేసుకుని క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని సమాచారం.
Nara Lokesh
Padayatra
Chandrababu
District Tours
Telugudesam

More Telugu News