KS Eshwarappa: త్వరలోనే కాషాయ జెండా జాతీయ పతాకం అవుతుంది: కర్ణాటక బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

  • జెండా వ్యాఖ్యలతో కలకలం రేపిన మాజీ మంత్రి
  • కాషాయ జెండాకు సుదీర్ఘ చరిత్ర ఉందన్న ఈశ్వరప్ప
  • కాషాయం త్యాగానికి చిహ్నం అని వెల్లడి 
Karnataka BJP leader KS Eshwarappa says Saffron flag will be national flag

కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కాషాయ జెండా దేశ జాతీయ పతాకం అవుతుందని, త్రివర్ణ పతాకం స్థానాన్ని భర్తీ చేస్తుందని పేర్కొన్నారు. కాషాయం త్యాగానికి చిహ్నం అని అభివర్ణించారు. 

కాషాయ జెండా సుదీర్ఘకాలంగా దేశంలో గౌరవం పొందుతోందని, కాషాయ జెండాకు వేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉందని ఈశ్వరప్ప తెలిపారు. కాషాయ జెండా స్ఫూర్తి తమలోనూ నిండాలని ఆర్ఎస్ఎస్ లో ప్రార్థిస్తుంటామని వెల్లడించారు. నేడో, రేపో కాషాయ జెండా జాతీయ పతాకం కావడం తథ్యమని అన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. 

"వాళ్లు (కాంగ్రెస్) చెప్పినప్పుడల్లా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాం. రాజ్యాంగం ప్రకారం త్రివర్ణ పతాకం మన జాతీయ జెండా. కాబట్టి త్రివర్ణ పతాకానికి ఇవ్వాల్సిన మేర గౌరవం ఇస్తాం" అని ఈశ్వరప్ప వివరించారు. కొంతకాలం కిందట ఓ కాంట్రాక్టరు మరణం నేపథ్యంలో, అవినీతి ఆరోపణలపై ఈశ్వరప్ప కర్ణాటక మంత్రివర్గం నుంచి వైదొలిగారు.

More Telugu News