అంపైర్ గా సెహ్వాగ్... అసలేం జరిగిందంటే...!
- అంపైరింగ్ లో లెజెండ్ గా గుర్తింపు పొందిన టౌఫెల్
- సెహ్వాగ్ కు మంచి అవగాహన ఉందని వెల్లడి
- అంపైరింగ్ కు నో చెప్పాడని వివరణ
- కోహ్లీ, అశ్విన్ కు మంచి అవగాహన ఉందని కితాబు
భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్ కాకముందు, ఫీల్డింగ్ సమయంలో స్క్వేర్ లెగ్ లో నిలుచునేవాడని వెల్లడించారు. ఆ సమయంలో తాను లెగ్ అంపైర్ గా ఉన్నప్పుడు, తన పక్కనే ఫీల్డింగ్ చేస్తుండే సెహ్వాగ్ ఇది అవుట్, ఇది నాటౌట్ అని చెబుతుండేవాడని గుర్తు చేసుకున్నారు. దాంతో, క్రికెట్ నుంచి తప్పుకున్నాక అంపైర్ గా అవతారం ఎత్తొచ్చు కదా? అని సలహా ఇచ్చానని, అయితే సెహ్వాగ్ అందుకు అంగీకరించలేదని టౌఫెల్ తెలిపారు. అంపైరింగ్ అంటే తనకిష్టం లేదని చెప్పాడని వివరించారు.
అంపైరింగ్ రంగంపై ఆసక్తి చూపించే దక్షిణాఫ్రికా బౌలర్ మోర్నీ మోర్కెల్ తదితర ఆటగాళ్లతోనూ తాను మాట్లాడానని, కానీ అందరూ అంపైర్లు కాలేరని టౌఫెల్ స్పష్టం చేశారు. తన వరకు సెహ్వాగ్ అంపైర్ గా మైదానంలో అడుగుపెడితే చూడాలని ఉందని మనసులో మాట వెల్లడించారు. అంతేకాదు, భారత జట్టులో విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లకు కూడా ఆట నియమనిబంధనలు, పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందని, వారిద్దరు కూడా అంపైరింగ్ రంగంలోకి రావొచ్చని టౌఫెల్ ఆహ్వానం పలికారు.