G.PullaReddy Sweets: 'పుల్లారెడ్డి స్వీట్స్' రాఘవరెడ్డిపై ఆయ‌న కోడ‌లు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

  • ఆడ‌పిల్ల పుట్టింద‌ని ఏడేళ్లుగా న‌ర‌కం చూపిస్తున్నారు
  • రెండేళ్లుగా అత్తారింటిలో న‌రకం చూస్తున్నా
  • మామ రాఘ‌వ‌రెడ్డి నుంచి నాకు ప్రాణ హాని ఉంది
  • లింగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించార‌న్న ప్ర‌జ్ఞారెడ్డి
  • వ‌దిలించుకునేందుకే త‌న కూతురిపై వేధింపుల‌న్న ప్ర‌జ్ఞారెడ్డి తండ్రి
pragna reddy viral allegations on her uncle pullareddy sweets owner raghava reddy

నేతి మిఠాయిల వ్యాపారంతో అత్యున్న‌త శిఖ‌రాల‌కు ఎదిగిన జి.పుల్లారెడ్డి కుటుంబం ఇప్పుడు ఓ చిన్న వివాదంలో చిక్కుకుంది. పుల్లారెడ్డి కుమారుడు రాఘ‌వ‌రెడ్డిపై ఆయ‌న కోడ‌లు ప్ర‌జ్ఞారెడ్డి తాజాగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. గృహ హింస‌కు సంబంధించి ఇప్ప‌టికే పంజాగుట్ట పోలీసుల‌ను ఆశ్ర‌యించిన ప్ర‌జ్ఞారెడ్డి... బుధ‌వారం కోర్టును ఆశ్ర‌యించారు. తాజాగా గురువారం ఆమె త‌న తండ్రి కేఆర్ఎం రెడ్డితో క‌లిసి ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌ను ఆశ్ర‌యించి త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని బ‌య‌టపెట్టారు.

రాఘ‌వ రెడ్డి కుమారుడైన త‌న భ‌ర్త త‌న‌పై వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డ్డార‌ని ప్ర‌జ్ఞారెడ్డి ఆరోపించారు. త‌న భ‌ర్త‌తో క‌లిసి అత్తామామ‌లు త‌న‌ను చంపేందుకు య‌త్నించార‌ని కూడా ఆమె తెలిపారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు చెబితే త‌న‌ త‌ల్లిదండ్రుల‌ను కూడా చంపేస్తామ‌ని బెదిరించారని ఆమె చెప్పారు. 

రెండేళ్లుగా అత్తారింటిలో న‌ర‌కం చూస్తున్నానన్న ప్ర‌జ్ఞారెడ్డి.. ఆడ‌బిడ్డ పుట్టింద‌ని త‌న‌ను ఏడేళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయింది. లింగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించార‌ని, మ‌గ పిల్లాడి కోసం థాయ్‌ల్యాండ్ వైద్యం చేయించుకోమ‌ని ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించారు. త‌న‌పై బ‌య‌ట ప్రైవేటు మ‌నుషుల‌తో నిఘా పెడుతున్నారని, ఇప్ప‌టికీ మామ రాఘ‌వ‌రెడ్డితో త‌న‌కు ప్రాణ హాని ఉందని అన్నారు. రాఘ‌వ‌రెడ్డి గ‌న్‌మెన్లు ఇప్ప‌టికీ తనను ఫాలో అవుతున్నారని ఆమె ఆరోపించారు. కూతురికి క‌నీసం మంచినీళ్లు ఇవ్వ‌లేని దుస్థితిని అనుభ‌వించాన‌న్న ప్ర‌జ్ఞారెడ్డి.. త‌ప్పు తెలుసుకుని వ‌స్తే త‌న భ‌ర్త‌తో క‌లిసి ఉండేందుకు త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని వెల్ల‌డించారు. 

రాఘ‌వ‌రెడ్డి ఇంటిలో త‌న కూతురు అనుభవించిన వేధింపుల‌పై ప్ర‌జ్ఞారెడ్డి తండ్రి కేఆర్ఎం రెడ్డి త‌న ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కారు. రాఘ‌వ‌రెడ్డితో త‌మ‌ కుటుంబానికి ప్రాణ‌హాని ఉంద‌న్న కేఆర్ఎం రెడ్డి.. స‌మ‌స్య ప‌రిష్కారం కోసం రెండేళ్లు య‌త్నించాన‌ని వెల్ల‌డించారు. వ‌దిలించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా త‌న‌ కూతురిపై వేధింపుల‌కు పాల్ప‌డ్డార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఢిల్లీలో త‌నకు ప‌లుకుబ‌డి ఉందని చెప్పిన రాఘ‌వ‌రెడ్డి ... నా కంపెనీల‌పై ఐటీ దాడులు చేయిస్తామ‌ని బెదిరించార‌ని కేఆర్ఎం రెడ్డి ఆరోపించారు. తెలంగాణ పోలీసుల‌పై త‌మ‌కు న‌మ్మకం ఉందని, న్యాయం జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నాన‌ని ఆయన తెలిపారు.

More Telugu News