Telangana: తెలంగాణలో మద్యం ధరలు పెరిగినా డోంట్ కేర్.. నాలుగు రోజుల్లో రూ. 523 కోట్లు తాగేసిన మందుబాబులు!

In Four Days liquor sales in Telangana crossed Rs 500 crores
  • చీప్ లిక్కర్‌పై రూ. 25, బీర్ బాటిల్‌పై రూ. 10 చొప్పున పెంపు
  • 19 నుంచే పెరిగిన ధరలు అమల్లోకి
  • నాలుగు రోజుల్లో 8.31 లక్షల కేసుల బీర్లు, 4.88 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు
  • గతేడాది మే నెల విక్రయాలతో పోలిస్తే 36.27 శాతం పెరుగుదల
తెలంగాణలో మద్యం ధరలు అమాంతం పెరిగినప్పటికీ ఏమాత్రం తగ్గేదేలేదంటున్నారు మందుబాబులు. గత నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 523 కోట్ల మద్యాన్ని ఊదిపడేశారు. ప్రభుత్వం ఇటీవల చీప్ లిక్కర్‌పై రూ. 25, బీర్ బాటిల్‌పై రూ. 10 చొప్పున పెంచింది. పెంచిన ధరలు ఈ నెల 19 నుంచే అమల్లోకి వచ్చాయి. అంతేకాదు, అప్పటి వరకు ఉన్న పాత స్టాక్‌కు లెక్కగట్టి మద్యం దుకాణాల నుంచి ఎక్సైజ్ డ్యూటీని వసూలు చేశారు. ఆ రోజు సాయంత్రం వరకు లెక్కింపు జరగడంతో పెద్దగా అమ్మకాలు జరగలేదు. ఆ రోజు రూ. 75 కోట్ల మద్యం మాత్రమే అమ్ముడైంది.

అయితే, ఆ తర్వాతి రోజు నుంచి విక్రయాలు ఊపందుకున్నాయి. 20న రూ. 145.3 కోట్లు, 21న రూ. 149.5 కోట్లు, 22న రూ. 153.5 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఫలితంగా నాలుగు రోజుల్లో మొత్తంగా రూ. 523 కోట్ల మద్యం అమ్ముడైంది. వీటిలో 8.31 లక్షల కేసుల బీర్లు, 4.88 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు జరిగాయి. ధరల పెంపు తర్వాత రోజుకు సగటున రూ. 130 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఈసారి విక్రయాలు 36.27 శాతం పెరగడం గమనార్హం.
Telangana
Liquor
Beer
Excise Duty

More Telugu News