Andhra Pradesh: జీవీఎల్‌ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి కారుమూరి

ap minister karumuri nageswar rao fires on bjp mp gvl narasimha rao comments
  • రాష్ట్రంలో సగం మందికే కేంద్రం బియ్యం ఇస్తోందన్న మంత్రి 
  • కేంద్రం ఇచ్చే అర్థ బంతి బోజనాలను ప్ర‌జ‌ల‌కు పెట్టలేమని వ్యాఖ్య 
  • పూర్తి స్థాయిలో బియ్యాన్ని ఇప్పించాలంటూ జీవీఎల్‌కు కారుమూరి విజ్ఞ‌ప్తి
పీఎం గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న కింద కేంద్రం బియ్యం ఇచ్చినా ఏపీ ప్ర‌భుత్వం పేద‌ల‌కు పంపిణీ చేయ‌డం లేద‌ని బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఏపీ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు స్పందించారు.  జీవీఎల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్న మంత్రి...  బియ్యం పంపిణీపై జీవీఎల్‌ వ్యాఖ్యలు అర్థరహితమని కొట్టిపారేశారు. ఈ మేర‌కు సోమ‌వారం తాడేప‌ల్లి వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మంత్రి... జీవీఎల్ వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పేద‌ల‌కు పూర్తిగా నూకల్లేని సన్న బియ్యం (సార్టేక్స్) ఇస్తున్నామన్న మంత్రి... కేంద్రం సార్టెక్స్ బియ్యం ఇవ్వకపోగా నాన్ సార్టెక్స్ బియ్యం ఇస్తోంద‌ని తెలిపారు. రాష్ట్రంలో పేద‌ల‌కు నాన్ సార్టెక్స్ బియ్యం ఇస్తే స‌రిపోద‌ని కూడా ఆయ‌న తెలిపారు. కేంద్రం తీరు వల్లే రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీ చేయలేకపోతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయంపై నీతి ఆయోగ్‌కు తాము ఇప్ప‌టికే లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు. కేంద్రం ఇచ్చే అర్థ బంతి బోజనాలను తాము ప్ర‌జ‌ల‌కు పెట్టలేమని మంత్రి తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై జీవీఎల్‌కు ప్రేమ ఉంటే కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో బియ్యాన్ని ఇప్పించాల‌ని మంత్రి కోరారు.

రాష్ట్రంలో త‌మ ప్ర‌భుత్వం 1.46 కోట్ల మంది లబ్ధిదారులకు బియ్యం ఇస్తోందని చెప్పిన మంత్రి... గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న కింద రాష్ట్రంలోని సగం మంది ( 86 లక్షల మంది) ల‌బ్ధిదారుల‌కే కేంద్రం బియ్యం ఇస్తోంద‌ని ఆరోపించారు. ధనిక రాష్ట్రాలైన కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు, రాజస్థాన్‌, మహారాష్ట్రల‌కు మాత్రం కేంద్రం అధికంగా బియ్యాన్ని ఇస్తోంద‌ని కూడా మంత్రి ఆరోపించారు. దీనిపై ప్రధానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మే 16న లేఖ రాశారని మంత్రి గుర్తు చేశారు.
Andhra Pradesh
GVL Narasimha Rao
Karumuri Nageswara Rao
AP Minister
YSRCP
BJP

More Telugu News