Umran Malik: సంచలన పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియాలో చోటు... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు జట్టు ఎంపిక

Umran Malik gets maiden Team India call for t20 series against South Africa
  • జూన్ 9 నుంచి భారత్ లో దక్షిణాఫ్రికా జట్టు పర్యటన
  • 5 టీ20 మ్యాచ్ లు ఆడనున్న సఫారీలు
  • ఐపీఎల్ లో విశేషంగా రాణించిన ఉమ్రాన్ మాలిక్
  • గుర్తించిన జాతీయ సెలెక్టర్లు
  • పలువురు కొత్త ఆటగాళ్లకు జాతీయ జట్టు పిలుపు
ఐపీఎల్ తాజా సీజన్ లో 150 కిమీ పైచిలుకు వేగంతో బంతులేస్తూ సంచలనం సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియాలో చోటు దక్కింది. దక్షిణాఫ్రికాతో త్వరలో జరిగే టీ20 సిరీస్ కు నేడు టీమిండియాను ఎంపిక చేశారు. ఈ జట్టులో ఉమ్రాన్ మాలిక్ కు కూడా స్థానం కల్పించారు. అంతేకాదు, అర్షదీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, దీపక్ హుడా కూడా భారత జట్టుకు ఎంపికయ్యారు. 

పొట్టి ఫార్మాట్లో దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా మరోసారి జాతీయ జట్టులోకి వచ్చారు. కాగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. ఈ సిరీస్ లో భారత జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. 

ఈ టీ20 సిరీస్ జూన్ 9 నుంచి 19వ తేదీ వరకు జరగనుంది. ఈ సిరీస్ లో మూడో మ్యాచ్ కు విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. 

అటు, ఇంగ్లండ్ తో గతంలో నిలిచిపోయిన ఐదో టెస్టుకు కూడా సెలెక్టర్లు జట్టును ఎంపిక చేశారు. అప్పట్లో భారత జట్టులో కరోనా కలకలం రేగడంతో ఈ టెస్టును రీషెడ్యూల్ చేశారు. ఈ మ్యాచ్ జులై 1 నుంచి 5వ తేదీ వరకు ఎడ్జ్ బాస్టన్ లో జరగనుంది.

టీ20 జట్టు ఇదే...
కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైఎస్ కెప్టెన్), దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.

ఇంగ్లండ్ తో ఐదో టెస్టుకు జట్టు ఇదే...
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, చటేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
Umran Malik
Team India
T20 Series
South Africa

More Telugu News