Navjot Singh Sidhu: నాకు ఆరోగ్యం బాగోలేదు.. లొంగిపోవడానికి సమయం ఇవ్వండి: నవజోత్ సింగ్ సిద్ధూ

Sidhu requests Supreme Court to give time to surrender
  • రోడ్డుపై గొడవ కేసులో సిద్ధూకి ఏడాది జైలు శిక్ష విధించిన సుప్రీంకోర్టు
  • లొంగిపోవడానికి కొన్ని వారాల సమయం కావాలని కోరిన సిద్ధూ
  • చీఫ్ జస్టిస్ కు అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించిన జస్టిస్ ఖన్విల్కర్
టీమిండియా మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు నిన్న ఏడాది జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. 1988లో రోడ్డుపై గొడవ పడిన ఘటనలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిని సిద్ధూ కొట్టారు. ఆయన కొట్టిన దెబ్బలు గుర్నామ్ తలకు బలంగా తగలడంతో ఆయన చనిపోయారు. ఈ కేసులోనే సిద్ధూకు సుప్రీంకోర్టు శిక్షను విధించింది.      

మరోవైపు, తాను లొంగిపోవడానికి కొన్ని వారాల సమయాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టును సిద్ధూ కోరారు. తనకు ఆరోగ్యం బాగోలేదని... ఈ కారణం వల్ల తనకు కొన్ని వారాల సమయాన్ని ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. సిద్ధూ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్ పై ఈరోజు కోర్టులో వాదనలు జరిగాయి. క్రైమ్ జరిగి ఇప్పటికే 34 ఏళ్లు గడిచిపోయాయని... సుప్రీంకోర్టు శిక్షను విధించడం కూడా జరిగిందని... ఇప్పుడు కూడా ఇంకా కొన్ని వారాల సమయం కావాలని అడగడం సరికాదని పంజాబ్ ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో, సింఘ్వీ తన వాదలను వినిపిస్తూ... తన క్లయింట్ లొంగిపోతాననే చెపుతున్నారని, కేవలం కొంత సమయాన్ని మాత్రమే అడుగుతున్నారని కోర్టుకు తెలిపారు. సమయాన్ని ఇవ్వడం, ఇవ్వకపోవడమనేది కోర్టు నిర్ణయమని అన్నారు. 

ఈ సమయంలో జస్టిస్ ఖన్విల్కర్ కలగజేసుకుంటూ... సమయాన్ని కోరుతూ ఒక అప్లికేషన్ ను ఫైల్ చేయాలని సూచించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ కు అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పారు.
Navjot Singh Sidhu
Road Rage Case
Supreme Court

More Telugu News