USA: రక్షణ సాయం పేరిట భారత్ ను మచ్చిక చేసుకునేందుకు అమెరికా ఎత్తులు

  • 500 మిలియన్ డాలర్ల ప్యాకేజీ అందించే ప్రతిపాదన
  • ఇంకా నిర్ణయం తీసుకోని బైడెన్ సర్కారు
  • భారత్ ను నమ్మకమైన భాగస్వామిగా చేసుకోవడంపై దృష్టి
US to offer India 500 mn dollars in military aid to reduce Russia dependence

భారత్ ను రష్యాకు దూరం చేసే పన్నాగాలకు అమెరికా పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఆయుధాల కోసం రష్యాపై భారత్ ఆధారపడడాన్ని తగ్గించేలా చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా భారత్ కోసం 500 మిలియన్ (రూ.3,850 కోట్లు) డాలర్ల సైనిక సాయాన్ని ఆఫర్ చేయనుంది. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం ద్వారా భారత్ తో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని అగ్రరాజ్యం అనుకుంటున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వర్గాలు తెలిపాయి.

విదేశీ సైనిక సాయం కింద 500 మిలియన్ డాలర్లు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉందని.. ఇజ్రాయెల్, ఈజిప్ట్ తర్వాత ఈ తరహా సాయం అందుకునే అతిపెద్ద దేశం భారత్ అవుతుందని ఆ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ ప్యాకేజీ ఎప్పుడు ప్రకటించేది చెప్పలేదు. ఉక్రెయిన్ పై రష్యా దాడికి దిగినా భారత్ తప్పుబట్టలేదు. రష్యాతో బంధాన్ని తెంపుకోలేదు. అయినప్పటికీ వ్యూహాత్మక అవసరాల కోణంలో భారత్ తో దీర్ఘకాలిక రక్షణ సంబంధాలకు జో బైడెన్ సర్కారు సుముఖంగా ఉన్నట్టు, అందులో భాగమే ఈ ప్యాకేజీ అని ఆ వర్గాలు తెలిపాయి. 

నమ్మకమైన భాగస్వామిగా భారత్ ను అమెరికా కోరుకుంటోందని.. భారత్ కు ఫైటర్ జెట్లు, యుద్ధ నౌకలు, యుద్ధ ట్యాంకులు ఎలా అందించాలన్నదే పెద్ద సవాలుగా ఆ వర్గాలు పేర్కొన్నాయి. రష్యా ఆయుధాల కొనుగోలు చేసే దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇది మొదటి నుంచి అమెరికాకు కంటగింపుగానే ఉంది. రష్యా నుంచి క్షిపణి రక్షక నిరోధక వ్యవస్థలను కొనుగోలు చేయవద్దంటూ ఒత్తిళ్లు కూడా తీసుకొచ్చింది. అయినా భారత్ లొంగలేదు. దీంతో అమెరికా ప్రత్యామ్నాయ మార్గాలను వెతికే పనిలో పడింది.

More Telugu News