Well being: ఆర్థికంగా బాగుండడం కూడా ఆరోగ్యమే..!

  • ఏడాదికోసారి ఆరోగ్య పరీక్షలు
  • అలాగే, ఏటా పెట్టుబడుల సమీక్షలు
  • జీవిత బీమా, ఆరోగ్య బీమా రక్షణ
  • రుణాలకు దూరంగా ఉండాలి
  • ఈ తరహా చర్యలతో ఆర్థిక ఆరోగ్యం
Financial Well being is equally important as physical health

ఆరోగ్యం అంటే తినే ఆహారం, శారీరక వ్యాయామానికే పరిమితం అనుకోవద్దు. ఆర్థికంగా బాగుండడం కూడా ఆరోగ్యానిస్తుంది. ఇది కూడా ఆరోగ్యాన్ని నిర్ణయించే అంశమేనని నిపుణుల విశ్లేషణ. ఆర్థిక స్తోమత, మానసిక ఆరోగ్యానికి మధ్య విడదీయలేని సంబంధం ఉంది. 

పొదుపు, మదుపు, ఆరోగ్య బీమా, జీవిత బీమా ఈ తరహా రక్షణ ఏర్పాట్లు లేకుండా వచ్చినదాంతో హాయిగా ఖర్చు చేసుకుంటూ వెళ్లడం ఆరోగ్యాన్నివ్వదు. ఆర్థిక భద్రతను ఇవ్వదు. 2021లో ప్రపంచ పొదుపు దినం సందర్భంగా నిర్వహించిన సర్వేలో 80 శాతం మంది తమకు కరోనా మహమ్మారి ఒక మేల్కొలుపు అని చెప్పారు. కనుక ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్థికపరమైన క్రమశిక్షణ అవసరం.


ఏటా ఆర్థిక సమీక్ష
నూతన ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టి అప్పుడే ఒక నెల గడిచిపోయింది. మరి ఇప్పటికైనా ఈ ఏడాదికి సంబంధించి పొదుపు, పెట్టుబడుల ప్రణాళికలు రూపొందించుకున్నారా..? లేదంటే వెంటనే ప్రారంభించండి. ఆరోగ్య రక్షణ దృష్ట్యా ఏడాదికోసారి అయినా అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకోవాలి. సమస్యలను ముందుగా గుర్తిస్తే వాటిని మెరుగ్గా నియంత్రించుకోవడం సాధ్యపడుతుంది. అలాగే, పొదుపు, పెట్టుబడులను కూడా ఏడాదికోసారి సమీక్షించుకోవాలన్నది నిపుణుల సూచన. 

అనుకున్నట్టు రాబడులు వస్తున్నాయా..? పెట్టుబడి పెట్టిన సాధనాల పనితీరు అంచనాలకు తగ్గట్టే ఉందా? అని చూసుకుని అవసరమైతే మార్పులు చేసుకోవాలి. అంతేకాదు ఏడాదికోసారి ఆర్థిక లక్ష్యాలను సమీక్షించుకోవాలి. వాటికి అనుగుణంగా పెట్టుబడులను మార్చుకోవాలి. పెట్టుబడులన్నీ తీసుకెళ్లి అధిక రాబడులు వచ్చే ఈక్విటీల్లోనే పెట్టేయడం సరికాదు. ఈక్విటీ, డెట్, బంగారం కలబోతగా ఉండాలి. రిస్క్ సామర్థ్యాన్ని బట్టి (వయసు, ఆర్థిక సామర్థ్యం) ఈక్విటీలకు 75 శాతం మించనీయకూడదు. సాధారణంగా ఈక్విటీలకు 60 శాతం, డెట్ కు 30 శాతం, బంగారానికి 10 శాతం కేటాయించుకోవచ్చని నిపుణులు చెబుతుంటారు. రియల్ ఎస్టేట్ కూడా ఒక సాధనమే.

బీమా రక్షణ
జీవిత బీమా, ఆరోగ్యబీమా రక్షణ కూడా కల్పించుకోవాలి. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి తనకు ఏదైనా జరిగితే కుటుంబం ఆర్థికంగా కష్టాలు పడకుండా రక్షణ కల్పించాలి. అందుకోసం తన వార్షిక ఆదాయానికి 10 రెట్ల నుంచి 20 రెట్లకు బీమా కవరేజీని టర్మ్ ఇన్సూరెన్స్ రూపంలో తీసుకోవాలి. ఇది చౌకగా వచ్చే ఇన్సూరెన్స్. ఇక కుటుంబ సభ్యులు అందరికీ కనీసం రూ.10 లక్షల హెల్త్ కవరేజీ ఉండాలి. అనారోగ్యం లేదా ప్రమాదం వల్ల ఆసుపత్రిలో చేరితే ఆర్థికంగా పడే భారం అంచనా వేయలేనిది. వైద్య బీమా లేని వారు కరోనా సమయంలో ఎంత కష్టాలు పడ్డారో చూశాం. కనుక ఆ పరిస్థితులు రాకుండా ముందే జాగ్రత్త పడాలి. 

రుణాలు..
డిజిటల్ శకం కావడంతో అన్ని సేవలు ఆన్ లైన్ అయిపోతున్నాయి. గంటల వ్యవధిలోనే రుణాలు మంజూరవుతున్నాయి. ఒకప్పుడు రుణం అవసరమైతే బ్యాంకుకు వెళ్లి ప్రాధేయపడాల్సి వచ్చింది. కానీ, నేడు రుణం ఇస్తామంటూ బ్యాంకులు, ఎన్బీఎఫ్ సీలు రుణ గ్రహీతలను ప్రాధేయపడుతున్నాయి. కాల్స్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే నేడు రుణాలు పెద్ద వ్యాపారం. రుణం ఇస్తే వాటికి లాభమే కానీ, తీసుకున్న వారికి కాదు. ఆర్థిక ప్రణాళిక, క్రమశిక్షణ, సన్నద్ధతను పట్టించుకోని వారు రుణ ఊబిలోకి దిగాల్సి వస్తుంది. అందుకే గృహ రుణం మినహా మరే ఇతర రుణాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ రుణాలు తీసుకున్న వారు తమకు ఉన్న అప్పుల బాధ్యత మేర బీమా రక్షణను అదనంగా కల్పించుకోవాలి.

ఆటోమేటిగ్గా వెళ్లిపోవాలి..
పెట్టుబడులను స్వయంగా ప్రతీ నెలా చేసే విధంగా కాకుండా.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో బ్యాంకు ఖాతా నుంచి వెళ్లే ఏర్పాటు చేసుకోవాలి. అది కూడా వేతనం జమ అయ్యే మరుసటి రోజే సిప్ తేదీగా ఉండాలి. ముందు ఇన్వెస్ట్ చేసిన తర్వాతే మిగిలిన మొత్తంలో ఇంటి బడ్జెట్ ను నడిపించాలి. నెలలో ఖర్చులన్నీ పోను మిగిలిందే ఇన్వెస్ట్ చేస్తానని అనుకుంటే.. అప్పుడు మిగిలేదీ ఉండదు.

More Telugu News