Kota Srinivasarao: చిరంజీవి సినీ కార్మికులకు అనవసర హామీలు ఇవ్వడం మానుకోవాలి: కోట శ్రీనివాసరావు

Kota Srinivasarao questions Chiranajeevi decision hospital for cine workers
  • సినీ కార్మికుల కోసం ఆసుపత్రి కడతానన్న చిరంజీవి
  • ఘాటుగా స్పందించిన కోట
  • సినీ కార్మికులకు కావాల్సింది ఉపాధి అని వెల్లడి
  • డబ్బులు ఉంటే ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకోగలరని వ్యాఖ్యలు 
ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికుల సంక్షేమం కోసం పలు హామీలు ఇవ్వడం తెలిసిందే. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ, సినీ కార్మికుల కోసం ఆసుపత్రి కడతానని వెల్లడించారు. అయితే, సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి హామీలు ప్రచారానికి ఉపయోగపడతాయి తప్ప, కార్మికులకు లాభించవని పేర్కొన్నారు. చిరంజీవి అనవసర హామీలు ఇవ్వడం మానుకోవాలని కోట అన్నారు. 

ఇలాంటి హామీలు ఇచ్చే బదులు, పని కోసం అలమటిస్తున్న సినీ కార్మికులకు ఉపాధి చూపించాలని హితవు పలికారు. కోట శ్రీనివాసరావు ఓ యూట్యూబ్ చానల్ తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

"సినీ కార్మికులు రోజుకు మూడు పూటలు తిండి కోసం అల్లాడుతుంటే చిరంజీవి ఆసుపత్రి కడతానని చెబుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఏదైనా పని కల్పించి ఓ దారి చూపించాలి కానీ... ఇప్పుడు ఆసుపత్రి అవసరమా?... వారికి ఉపాధి కల్పిస్తే నాలుగు డబ్బులు సంపాదించుకుంటారు... అప్పుడు ఏ ప్రైవేటు ఆసుపత్రిలోనైనా చూపించుకోగలరు. ఏ చర్య అయినా సినీ కార్మికుల సంపూర్ణ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని  తీసుకోవాలి" అని కోట తన అభిప్రాయాలను పంచుకున్నారు.
Kota Srinivasarao
Chiranjeevi
Cine Workers
Hospital
Tollywood

More Telugu News