Kamareddy District: టాటా ఏస్ డ్రైవర్ నిర్లక్ష్యం.. రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం

9 dead in a road accident in kamareddy
  • ‘అంగడి దింపుడు’ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఘటన
  • ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన టాటా ఏస్ వాహనం
  • లారీ డ్రైవర్ అప్రమత్తమైనా తప్పని ప్రమాదం
  • టాటా ఏస్ డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణ
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. హసన్‌పల్లి గేటు వద్ద టాటా ఏస్ వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలం చిల్లర్గికి చెందిన సౌదర్‌పల్లి మాణిక్యం గత గురువారం మృతి చెందారు. దశదినకర్మ అనంతరం నిన్న వారి కుటుంబ సభ్యులను టాటా ఏస్ వాహనంలో ఎల్లారెడ్డి పట్టణంలోని వారపుసంతలో అంగడిదింపుడు (చితికి నిప్పు అంటించిన వ్యక్తితో సంతలోని నిత్యావసర వస్తువులను ముట్టిస్తారు)  కార్యక్రమానికి తీసుకెళ్లారు.

అనంతరం తిరిగి వస్తుండగా హసన్‌పల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీని టాటా ఏస్ ఢీకొట్టింది. ప్రమాదాన్ని శంకించిన లారీ డ్రైవర్ లారీని రోడ్డు కిందికి తీసుకెళ్లినా ప్రయోజం లేకపోయింది. టాటా ఏస్ డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జు అయింది. డ్రైవర్ సాయిలు (25), లచ్చవ్వ (45) అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆసుపత్రులకు తలించారు.

ఈ క్రమంలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఇద్దరూ మరణించారు. మొత్తంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Kamareddy District
Road Accident
Telangana

More Telugu News