Harish Rao: ఈయన మమ్మల్ని ఊరికే తిడుతుంటారు... మీరైనా చెప్పండమ్మా!: రాజాసింగ్ ను ఉద్దేశించి నవ్వులు పూయించిన హరీశ్ రావు

Harish Rao make fun with BJP MLA Raja Singh in Koti ENT Hospital
  • కోఠీ ఈఎన్టీ ఆసుపత్రిలో హరీశ్ రావు పర్యటన
  • పర్యటనలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
  • ఓ రోగి తల్లితో మాట్లాడిన హరీశ్
  • వైద్య సేవలు బాగున్నాయని చెప్పిన మహిళ
  • వింటున్నారు కదా అంటూ రాజాసింగ్ కు హరీశ్ చురక
తెలంగాణ ఆరోగ్య మంత్రి హరీశ్ రావు కోఠీ ఈఎన్టీ ఆసుపత్రిలో పర్యటించారు. ఈ పర్యటనలో మంత్రి వెంట గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఉద్దేశించి నవ్వులు పూయించారు. "ఈఎన్టీ ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయి? మందులు ఇక్కడే ఇస్తున్నారా?" అంటూ హరీశ్ రావు ఓ రోగి తల్లిని అడిగారు. 

అందుకామె బదులిస్తూ, ఆసుపత్రిలో సేవలు బాగున్నాయని, మందులు కూడా ఇక్కడే ఇస్తున్నారని వెల్లడించింది. దాంతో హరీశ్ రావు... "పక్కాగా ఇస్తున్నారా?" అంటూ మళ్లీ అడిగారు. దాంతో ఆమె "పక్కా" అంటూ జవాబిచ్చింది. 

ఆపై రాజాసింగ్ వైపు తిరిగిన హరీశ్ "ఈయనకు మీరైనా చెప్పండమ్మా" అని అన్నారు. "జరా సునో జీ" అంటూ రాజాసింగ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

"ఈయన మమ్మల్ని ఊరికే తిడుతుంటారు... ప్రభుత్వ ఆసుపత్రులు ఎలాంటి సేవలు అందిస్తున్నాయన్నది మీరైనా ఆయనకు వివరించండి" అని సూచించారు. 

అంతేకాదు, రాజాసింగ్ ను చూస్తూ... "ఆమె ఏం చెప్పిందో విన్నారు కదా... ఇవే మాటలు మీరు అసెంబ్లీలో చెప్పాలి... చెబుతారు కదా!" అని చమత్కరించారు. దాంతో రాజాసింగ్ తో సహా అక్కడున్న వారందరూ నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Harish Rao
Raja Singh
ENT Hospital
TRS
BJP
Hyderabad
Telangana

More Telugu News