KGF2: హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో చిత్రంగా 'కేజీఎఫ్2'.. తొలి స్థానంలో ఏ సినిమా ఉందంటే..?

  • లైఫ్ టైమ్ రన్ లో రూ. 387.40 కోట్లు వసూలు చేసిన 'దంగల్'
  • కేవలం 22 రోజుల్లోనే ఆ రికార్డును బద్దలు కొట్టిన 'కేజీఎఫ్2'
  • ఈరోజుతో హిందీలో రూ. 400 కోట్లు దాటిన 'కేజీఎఫ్2' వసూళ్లు 
KGF2 surpasses Dagal life time run collections

కన్నడ స్టార్ యశ్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన 'కేజీఎఫ్2' చిత్రం రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన అన్ని భాషల్లో (కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ) భారీ వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలో హిందీలో అరుదైన ఘనతను సాధించింది.

జీవితకాల కలెక్షన్లలో ఆమిర్ ఖాన్ చిత్రం 'దంగల్'ను 'కేజీఎఫ్2' అధిగమించింది. 'దంగల్' చిత్రం లైఫ్ టైమ్ రన్ లో రూ. 387.40 కోట్లను వసూలు చేయగా... కేవలం 22 రోజుల్లోనే ఆ రికార్డును 'కేజీఎఫ్2' బద్దలు కొట్టింది. హిందీలో మే 5 వరకు 'కేజీఎఫ్2' రూ. 391.65 కోట్లను వసూలు చేసింది. ఈరోజు ఆ మొత్తం రూ. 400 కోట్లను దాటే అవకాశం ఉందని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. మరో ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... 'కేజీఎఫ్2' ఈ రోజు రూ. 400 కోట్ల క్లబ్ లో చేరిందని చెప్పారు. 

హిందీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రాల జాబితాలో 'బాహుబలి2' తొలి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రం హిందీ వర్షన్ రూ. 511.30 కోట్లను వసూలు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హిందీలో ఇప్పటి వరకు కేవలం రెండు చిత్రాలు మాత్రమే రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. ఆ రెండూ దక్షిణాది చిత్రాలే (బాహుబలి2, కేజీఎఫ్2) కావడం గర్వకారణం.

More Telugu News