Venus: శుక్రుడిపై జరిగినట్టే.. భూమ్మీది నీళ్లన్నీ కూడా పోతాయా?.. నాసా సైంటిస్టులు చెబుతున్నది ఇదే!

  • శుక్రుడి చుట్టూ ఎలక్ట్రిక్ పొటెన్షియల్
  • వాక్యూమ్ క్లీనర్ లా నీళ్లను గుంజేసిన వైనం
  • భూమ్మీద కూడా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉందన్న శాస్త్రవేత్తలు
  • వీనస్ తో పోలిస్తే 25 రెట్ల బలహీనమని వెల్లడి
  • లెక్కించేందుకు మే 9న నాసా ఎండ్యూరెన్స్ ప్రయోగం
NASA To Send Rocket To North Pole To Measure Electric Potential

ఒకప్పుడు శుక్రుడిపై భూమి లాంటి వాతావరణమే ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఆ గ్రహంపైనా నీళ్లుండేవని, ఆ తర్వాత నీళ్లన్నీ ఆవిరై సలసల కాగే అగ్నిగోళమైందని అంటారు. దానికి కారణం గ్రహం చుట్టూ ఉన్న అయనోస్ఫియర్ లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ (సంభావ్య విద్యుత్) ఉండేదట. అది శుక్ర గ్రహంపై ఉన్న నీటిని మొత్తం వాక్యూమ్ క్లీనర్ లా లాగేసుకుందని శాస్త్రవేత్తల అభిప్రాయం. దీంతో శుక్రుడిపై నీళ్లు మాయమయ్యాయన్నది అంచనా.  

అయితే, భూమి చుట్టూ ఉన్న అయనోస్ఫియర్ లోనూ ఇలాంటి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి, శుక్రుడిపై జరిగినట్టే భూమిపైనా జరుగుతుందా? అంటే మాత్రం కచ్చితంగా కాదనే అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు. 

శుక్రుడి వాతావరణంలో ఉన్న ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కన్నా భూమ్మీద ఉన్న ఎలక్ట్రిక్ పొటెన్షియల్ 25 రెట్లు బలహీనమని అంటున్నారు. భూమి చుట్టూ ఉన్న విద్యుత్ శక్తి కేవలం 0.3 వోల్టులేనని చెబుతున్నారు. ఇది ఓ మామూలు బ్యాటరీ కన్నా బలహీనమని అంటున్నారు. 

ఈ క్రమంలోనే ఆ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ను లెక్కించేందుకు ఈ నెల 9న నాసా ఎండ్యూరెన్స్ అనే ప్రయోగాన్ని నిర్వహించనుంది. ఆర్కిటిక్ మహాసముద్రంలో ఉన్న నార్వే ద్వీపకల్పం శవల్బార్డ్ నుంచి భూమిపై ఉన్న అయస్కాంత క్షేత్రం ఉన్న ఉత్తర ధ్రువానికి రాకెట్ ను పంపనుంది. భూ వాతావరణం నుంచి తప్పించుకుని వెళ్లిపోతున్న ఎలక్ట్రాన్ల శక్తిని ఎండ్యూరెన్స్ ద్వారా లెక్కించనున్నారు. 

వాస్తవానికి ఎలక్ట్రాన్లు భూ వాతావరణం నుంచి వేగంగా బయటకు వెళ్లిపోయేవని, కానీ, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వల్ల అదిప్పుడు కొంచెం నెమ్మదించిందని, దానికిగల అంతర్గత కారణాలను తెలుసుకునేందుకే ఎండ్యూరెన్స్ ప్రయోగం చేపడుతున్నామని నాసా వెల్లడించింది. 

అనుకున్నవి అనుకున్నట్టు జరిగి మిషన్ సక్సెస్ అయితే.. ప్రపంచంలో భూమి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ను లెక్కించిన తొలి ప్రయోగం ఇదే అవుతుంది.

More Telugu News