Andhra Pradesh: క్యాషియర్‌ను తుపాకితో బెదిరించి నగదు దోచుకెళ్లిన దుండగుడు.. అనకాపల్లి జిల్లాలో ఘటన

Bank Robbery In Anakapalle dist APGVG
  • నర్సింగబిల్లిలోని ఏపీజీవీబీలో ఘటన
  • 2 గంటల సమయంలో బ్యాంకులో ప్రవేశించిన ఆగంతకుడు
  • రూ. 3,31,320 దోచుకెళ్లిన దుండగుడు
  • కొక్కిరాపల్లి వద్ద  బైక్‌పై వెళ్తున్నట్టుగా సీసీటీవీలో రికార్డు

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా కశింకోట మండలం నర్సింగబిల్లిలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాశ్ బ్యాంకు (ఏపీజీవీబీ)లో పట్టపగలే బ్యాంకు దోపిడీ జరిగింది. పోలీసుల కథనం మేరకు 16వ నంబరు జాతీయ రహదారి పక్కనే ఈ బ్యాంకు ఉంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బ్యాంకు మేనేజర్, గుమస్తా భోజనానికి వెళ్లగా, క్యాషియర్ ప్రతాప్‌రెడ్డి ఒక్కరే సీటులో ఉన్నారు. కస్టమర్లు కూడా ఎవరూ లేకపోవడంతో ఖాళీగా ఉంది. అదే సమయంలో నేవీ బ్లూ కలర్ జాకెట్, జీన్స్ ప్యాంటులో ఉన్న ఓ యువకుడు హెల్మెట్, ముఖానికి మాస్క్‌తో బ్యాంకులోకి వచ్చాడు. 

నేరుగా క్యాషియర్ వద్దకు వెళ్లి తుపాకి గురిపెట్టాడు. కౌంటర్‌లోని నగదును తన బ్యాగులో పెట్టాలని హిందీలో బెదిరించాడు. దీంతో క్యాషియర్ ప్రతాప్‌రెడ్డి కౌంటర్‌లో ఉన్న 3,31,320 రూపాయలను బ్యాగులో సర్దాడు. ఆ తర్వాత లాకర్ తెరవమని దుండగుడు ఆయనను బెదించాడు. లాకర్ తెరిచిన ప్రతాప్‌రెడ్డి లోపలికి వెళ్లి గడియపెట్టుకున్నాడు. గమనించిన దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. 

బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం సిబ్బంది వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాలను పరిశీలించగా  రాజమహేంద్రవరం మార్గంలో ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లి వద్ద ఆగంతకుడు బైక్‌పై వెళ్తున్నట్టు రికార్డైంది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News