Karumuri Nageswar Rao: కేటీఆర్ స్నేహితుడు టీడీపీ వ్యక్తే అయ్యుండొచ్చు: మంత్రి కారుమూరి

Minister Karumuri Nageswar Rao fires on KTR
  • మెహర్బానీ కోసమే ఏపీ గురించి కేటీఆర్ మాట్లాడారు
  • జగన్ గురించి మాట్లాడితే పెద్దవాడిని అయిపోతానని అనుకొని ఉండొచ్చు
  • తెలంగాణ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి
ఏపీ గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలను పలువురు ఏపీ మంత్రులు తప్పుపట్టారు. మరో మంత్రి కారుమూరి నాగేశ్వరారావు మాట్లాడుతూ, అనేక మంది మంత్రులు ఏపీకి వచ్చి అభినందిస్తున్నారని చెప్పారు. కేవలం మెహర్బానీ కోసమే కేటీఆర్ మాట్లాడారని అన్నారు. కేటీఆర్ ఆ విధంగా మాట్లాడక పోతే బాగుండేదని చెప్పారు. 

నాలుగు వర్షపు చినుకులు పడగానే హైదరాబాద్ మునిగిపోతుందని కారుమూరి ఎద్దేవా చేశారు. డ్రగ్స్ కేసులు హైదరాబాద్ లో ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ లు ఎంత మందికి ఇచ్చారో కేటీఆర్ చెప్పాలని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. 

జగన్ కు ఎంతో మంచి పేరు ఉందని... అందుకే ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కారుమూరి విమర్శించారు. ఎదుటి వారిపై ఒక వేలు చూపిస్తే... నాలుగు వేళ్లు మీవైపే చూపిస్తాయనే విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఏపీ పరిస్థితి గురించి చెప్పిన కేటీఆర్ స్నేహితుడు టీడీపీ వ్యక్తే అయ్యుండొచ్చని అన్నారు. జగన్ గురించి మాట్లాడితే తాను కూడా పెద్దవాడిని అయిపోతానని కేటీఆర్ భావించి ఉండొచ్చని విమర్శించారు.
Karumuri Nageswar Rao
Jagan
YSRCP
KTR
TRS

More Telugu News