Bigg Boss: బిగ్‌బాస్ రియాలిటీ షోపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

AP High Court Serious Words On Bigg Boss Reality Show
  • ‘బిగ్‌బాస్’ వంటి షోల వల్ల సమాజంలో విపరీత పోకడలు పెరిగిపోతున్నాయని ఆవేదన
  • అభ్యంతరకర షోల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న హైకోర్టు
  • మన  పిల్లలు బాగున్నారని పట్టించుకోకపోవడం భావ్యం కాదన్న ధర్మాసనం
  • 2019లో పిల్ దాఖలు చేసిన కేతిరెడ్డి
  • సోమవారం విచారిస్తామన్న న్యాయస్థానం
బిగ్‌బాస్ రియాలిటీ షో అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించేదిగా ఉందని, దీనివల్ల యువత పెడదారి పడుతోందంటూ దాఖలైన పిల్‌పై స్పందించిన ఏపీ హైకోర్టు.. మంచి పిల్ వేశారంటూ పిటిషనర్‌ను ప్రశంసించింది. దీనిని సోమవారం విచారిస్తామన్న ధర్మాసనం.. బిగ్‌బాస్ వంటి షోల వల్ల యువత పెడదారిపడుతోందని వ్యాఖ్యానించింది. ఇలాంటి వాటివల్ల సమాజంలో విపరీత పోకడలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అభ్యంతరకర షోల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ టి.రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

బిగ్‌బాస్ షో అశ్లీలతను, అసభ్యతను ప్రోత్సహించేలా ఉందంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఇది విచారణకు నోచుకోకపోవడంపై నిన్న పిటిషనర్ తరపు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. స్పందించిన న్యాయస్థానం.. మంచి వ్యాజ్యమని ప్రశంసించింది. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో అశ్లీలత పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 

తమ పిల్లలు బాగున్నారని, ఇలాంటి షోలతో తమకేం పని అని ప్రజలు భావిస్తున్నారని పేర్కొంది. ఇతరుల గురించి పట్టించుకోకపోతే భవిష్యత్తులో మనకు సమస్య ఎదురైనప్పుడు వారు కూడా పట్టించుకోరని వ్యాఖ్యానించింది. 2019లో వ్యాజ్యం దాఖలు చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు పొందకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇదే విషయమై పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించిన ధర్మాసనం.. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని పేర్కొంది.
Bigg Boss
Reality Show
AP High Court
Kethireddy Jagadishwar Reddy

More Telugu News