Sourav Ganguly: ఫామ్ లో లేక తంటాలు పడుతున్న కోహ్లీ, రోహిత్... గంగూలీ ఏమన్నాడంటే...!

Ganguly opines on Kohli and Rohit Sharma poor batting
  • ఐపీఎల్ లో దారుణంగా ఆడుతున్న కోహ్లీ, రోహిత్
  • 9 మ్యాచ్ ల్లో 128 పరుగులు చేసిన కోహ్లీ
  • 8 మ్యాచ్ ల్లో 153 పరుగులు చేసిన రోహిత్
  • వాళ్లు కచ్చితంగా ఫామ్ లోకి వస్తారన్న దాదా
పరుగుల యంత్రాలుగా పేరుగాంచిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్ లో అత్యంత గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. రోహిత్ శర్మ కాసేపైనా క్రీజులో నిలుస్తుండగా, కోహ్లీ మరీ దారుణంగా ఇలా వచ్చి అలా వెనుదిరుగుతున్నాడు. కోహ్లీ 9 మ్యాచ్ ల్లో 128 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 8 మ్యాచ్ ల్లో 153 పరుగులు చేశాడు. వీరి పేలవ ఫామ్ విమర్శకులకు పని కల్పించింది. 

ఈ నేపథ్యంలో, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ గొప్ప ఆటగాళ్లనడంలో సందేహంలేదని, వారిద్దరూ తప్పకుండా ఫామ్ లోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే వాళ్లు పరుగులు సాధించడం షురూ చేస్తారని తెలిపారు. 

ప్రస్తుతం కోహ్లీ మదిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తనకు తెలియడంలేదని, కానీ అతడు పూర్వపు లయ అందుకుని స్కోరుబోర్డును పరుగులెత్తించడం మళ్లీ చూస్తామని గంగూలీ అన్నారు. కోహ్లీ మేటి ఆటగాడని కితాబిచ్చారు. 

ఇక టోర్నీలో రెండు కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడం పట్ల కూడా గంగూలీ స్పందించారు. ఐపీఎల్ ను తాను కూడా చూస్తున్నానని, ఎంతో ఆసక్తికరంగా సాగుతోందని తెలిపారు. ముఖ్యంగా, కొత్త జట్లు గుజరాత్, లక్నో చాలా బాగా ఆడుతున్నాయని ప్రశంసించారు.
Sourav Ganguly
Virat Kohli
Rohit Sharma
IPL

More Telugu News