Russia: రష్యా సైనికులను అడ్డుకునేందుకు.. ఊరినే వరదలతో ముంచేసుకున్న ఉక్రెయిన్ గ్రామస్థులు.. ఇవిగో ఫొటోలు!

Village Flooded By Villagers To Stop Russian Soldiers
  • బాంబులు, రాకెట్ దాడులతో విరుచుకుపడుతున్న రష్యా
  • రష్యా సైన్యాన్ని అడ్డుకునేందుకు దెమిదివ్ గ్రామస్థులు పెద్ద సాహసం
  • వారి యుద్ధ ట్యాంకులు వెళ్లకుండా కృత్రిమ వరదలు
  • దినిప్రో నది నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడిన వైనం
ఓ వైపు ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడుతున్నా.. బాంబులతో కకావికలం చేస్తూ విలయం సృష్టిస్తున్నా ఉక్రెయిన్ మాత్రం పట్టుదలగా పోరాడుతూనే ఉంది. ఇప్పటికే చాలా నగరాలను రష్యా చేజిక్కించుకున్నా.. దేశాన్ని కాపాడుకునే ఏ ఒక్క చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ప్రజలూ పెద్ద సాహసాలే చేస్తున్నారు. 

అందులో భాగంగానే ఊర్లను కావాలనే జనాలు వరదల్లో ముంచేస్తున్నారు. పొరుగున పారే నదుల్లో మోటార్లు వేసి నీటిని తోడి గ్రామాల్లోకి మళ్లిస్తున్నారు. అలాంటి ఘటనే రాజధాని కీవ్ కు సమీపంలోని దెమిదివ్ గ్రామంలో జరిగింది. రష్యా యుద్ధ ట్యాంకులు వెళ్లలేకుండా ఊరు మొత్తాన్ని గ్రామస్థులు వరద నీటితో ముంచేశారు. దినిప్రో నది నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడిపోస్తున్నారు. 
ఉక్రెయిన్ పై రష్యా చేసిన దండయాత్ర కన్నా ఈ నష్టం కష్టం తమకు పెద్దదేమీ కాదని గ్రామస్థులు తల ఎత్తుకుని సగర్వంగా చెబుతున్నారు. రష్యాను మట్టికరిపించేందుకు ఏదైనా చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఊరిని వరదల్లో ముంచేసినందుకు ఏ ఒక్కరికీ బాధ లేదని గ్రామస్థులు చెబుతున్నారు. రష్యా నుంచి తమ దేశాన్ని, ప్రాంతాన్ని, భూభాగాన్ని కాపాడుకునేందుకు ఇదో చిన్న ప్రయత్నమని చెప్పుకొచ్చారు. 

ఇక, గత నెలలో వచ్చిన వరదల కారణంగా పలు ప్రాంతాల నుంచి రష్యా తన బలగాలను వెనక్కు రప్పించుకుంది. అంటే రష్యా వెనకడుగు వేయడంలో వరదలు కూడా సాయం చేశాయి. ఈ నేపథ్యంలోనే దెమిదివ్ గ్రామస్థులు ఉడుతాభక్తిగా తమ ఊరిని ముంచేసుకున్నారు. 
కాగా, ధైర్యం అనేది ఉక్రెయిన్ ప్రజల డీఎన్ఏల్లోనే ఉందని ఉక్రెయిన్ ప్రభుత్వాధికారి మిఖాయిల్ ఫెడోరోవ్ చెప్పారు. ఊరిని వరదలతో ముంచేసిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన.. ఈ నిర్ణయం వల్ల రాజధాని కీవ్ లో బలగాలు డిఫెన్సివ్ చర్యలను చేపట్టేందుకు అవకాశం దొరికినట్టయిందన్నారు. సాధారణ పౌరులు కూడా హీరోల్లామారి విజయం కోసం పోరాడుతున్నారని కామెంట్ చేశారు. 
Russia
Ukraine
War
Kyiv

More Telugu News