Mayadhar Raut: అధికారుల దుందుడుకుతనంతో రోడ్డున పడ్డ 90 ఏళ్ల వృద్ధ కళాకారుడు

  • ఢిల్లీలోని ఏషియన్ గేమ్స్ విలేజ్ లో కళాకారులకు వసతి
  • 2014లో రద్దు చేసిన ప్రభుత్వం
  • బంగ్లాలను ఖాళీ చేసిన పలువురు కళాకారులు
  • ఇప్పటిదాకా గేమ్స్ విలేజ్ లోనే ఉన్న గురు మయధర్ రౌత్
  • బలవంతంగా ఖాళీ చేయించిన అధికారులు
Officials evacuated Guru Mayadhar Raut forcefully from govt bungalow

దేశంలోని పలువురు ప్రముఖ కళాకారులకు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం దేశ రాజధానిలో ఉన్న ఏషియన్ గేమ్స్ విలేజ్ లోని బంగ్లాల్లో వసతి కల్పించింది. అయితే 2014లో ఈ సదుపాయాన్ని రద్దు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో కొందరు కళాకారులు కోర్టుకు వెళ్లినా, ఫలితం లేకపోవడంతో తమ వసతి గృహాలను ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయితే, 90 ఏళ్ల ఒడిస్సీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గురు మయధర్ రౌత్ మాత్రం ఇప్పటికీ ఏషియన్ గేమ్స్ వసతి గృహంలోనే నివాసం ఉంటున్నారు. దాంతో అధికారులు నేడు ఆయను బలవంతంగా ఖాళీ చేయించారు. 

ఆయన సామాన్లను ఇంటి నుంచి బయటికి తీసుకువచ్చారు. దాంతో మయధర్ రౌత్ రోడ్డునపడ్డారు. ఈ పరిస్థితిపై ఆయన కుమార్తె మధుమిత తీవ్రంగా స్పందించారు. అధికారులు వచ్చిన సమయంలో తాను తన తండ్రికి ఆహారం తినిపిస్తున్నానని, కనీస సమయం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కూలీలతో సామాన్లు బయట పెట్టించారని వివరించారు. ఈ హఠాత్పరిణామంతో తన తండ్రి షాక్ కు గురయ్యారని, పక్కనే తానుండబట్టి సరిపోయిందని తెలిపారు. లేకపోతే, తన తండ్రి ప్రాణాలు విడిచి ఉండేవారేమోనని మధుమిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

తన నృత్య కళతో ఎంతో సేవ చేసి, అనేక ఘనతలు అందుకున్న ఆయనకు ఈ అవమానం జరగడం బాధాకరమని పేర్కొన్నారు. తన తండ్రికి ఎక్కడా ఎలాంటి ఆస్తులు కూడా లేవని వాపోయారు. కళాకారులు అంటే మోదీ సర్కారుకు ఏమాత్రం గౌరవం లేదని రుజువైందని ఆమె విమర్శించారు. అధికారులు ప్రభుత్వాజ్ఞలు పాటించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ వారు వ్యవహరించిన తీరు చాలా బాధ కలిగించిందని చెప్పారు. 

కాగా, ఏషియన్ గేమ్స్ విలేజ్ లో ఖాళీ చేయని ఇతర కళాకారులకు ప్రభుత్వం మే 2 వరకు గడువిచ్చిందని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే అనేక పర్యాయాలు వీరికి నోటీసులు పంపినట్టు వెల్లడించారు. కాగా, సరిగా నిలబడలేని స్థితిలో ఉన్న మయధర్ రౌత్ తన కుమార్తె సాయంతో వీధిలో తన సామాన్ల మధ్య నిలబడి ఉన్న దృశ్యం చూపరులను కదిలించివేస్తోంది. ఆయన పద్మశ్రీ అవార్డు పత్రం కూడా సామాన్ల నడుమ దర్శనమిచ్చింది.
.

More Telugu News