long term capital gains tax: దీర్ఘకాల మూలధన లాభాల పన్నును సంస్కరించే యోచనలో కేంద్రం

  • ఈక్విటీలకు ఏడాది దాటితే ఎల్టీసీజీ
  • డెట్ కు మాత్రం మూడేళ్లు నిండాలి
  • పన్ను రేటులోనూ వైరుధ్యం
  • ఏకరూపత తీసుకురావాలన్న యోచన 
Govt starts work to bring parity to long term capital gains tax laws

పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)లో సారూప్యతను తీసుకురావడంపై కేంద్ర సర్కారు దృష్టి సారించింది. ఈక్విటీ పెట్టుబడులు, డెట్ పెట్టుబడులకు ఎల్టీసీజీ వేర్వేరుగా ఉంది. ఈక్విటీల్లోనూ లిస్టెడ్ కంపెనీలకు ఒక మాదిరిగా, అన్ లిస్టెడ్ కు మరో మాదిరిగా పన్ను రేటు, కాల వ్యవధి పరంగా వ్యత్యాసం నెలకొంది. దీంతో ఈ సాధనాల మధ్య సమానత్వం తీసుకురావడంపై ప్రభుత్వం చర్చలు మొదలు పెట్టినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం ఒక లిస్టెడ్ కంపెనీలో వాటాలు కొనుగోలు చేసి ఏడాది తర్వాత విక్రయిస్తే వచ్చిన లాభాన్ని ఎల్టీసీజీగా పరిగణిస్తున్నారు. లాభంపై మొదటి రూ.లక్ష తర్వాత 10 శాతంగా అమలవుతోంది. అదే అన్ లిస్టెడ్ స్టాక్ లో పెట్టుబడి పెడితే రెండేళ్ల తర్వాత విక్రయించగా వచ్చిన లాభాన్ని ఎల్టీసీజీగా పరిగణిస్తూ 20 శాతం పన్ను అమలు చేస్తున్నారు. ఇక డెట్ పెట్టుబడులు కూడా మూడేళ్ల తర్వాత విక్రయిస్తే వచ్చే లాభాన్ని ఎల్టీసీజీగా చూస్తూ.. 20 శాతం పన్ను రేటు అమల్లో ఉంది. ఇలా ఒక్కో సాధనానికి ఎల్టీసీజీ రేటు, కాల వ్వవధి వేర్వేరుగా ఉండడం గందరగోళానికి అవకాశం ఇస్తోంది.

దీంతో ఎల్టీసీజీ రేటుతోపాటు, కాల వ్యవధిని మార్చే అంశంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీర్ఘకాల మూలధన లాభాల పన్నులో సంస్కరణలు మంచిదే కానీ, స్వల్పకాల మూలధన లాభంపై పన్ను పెంచితే అది ఇన్వెస్టర్లను నిరుత్సాహానికి గురి చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎల్టీసీజీలో మార్పులను ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రకటించొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనిపై ప్రజల నుంచి సూచనలు, అభిప్రాయాలు కూడా తీసుకోవచ్చని తెలిపాయి.

More Telugu News