Nimmala Rama Naidu: ఈ ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి పోలవరానికి శాపం: నిమ్మల రామానాయుడు

Nimmala Ramanaidu press meet on Polavaram project
  • ఎన్ని ప్రాజెక్టులున్నాయో కూడా సీఎంకు తెలియదని నిమ్మల వ్యాఖ్య 
  • అసెంబ్లీలో అబద్ధాలు చెప్పావు? అంటూ నిలదీత 
  • డయాఫ్రం వాల్ ఉందో, లేదో కూడా తెలియని దౌర్భాగ్య స్థితిలో మంత్రి ఉన్నారంటూ విమర్శ  
పోలవరం ప్రాజెక్టు అంశంపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వైసీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. కనీసం రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో కూడా ఈ ముఖ్యమంత్రికి తెలియదని వ్యాఖ్యానించారు. డయాఫ్రం వాల్ ఉందో, లేదో కూడా తెలియని దౌర్భాగ్య స్థితిలో నీటి పారుదల శాఖ మంత్రి ఉన్నారని తెలిపారు. వీళ్లే పోలవరానికి శాపం అని విమర్శించారు. ఏపీకి అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం అని, అలాంటి ప్రాజెక్టుకు గత రెండేళ్లుగా నష్టం జరుగుతుంటే ఎందుకు దాచిపెట్టావంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. 

"2021 జూన్ లో పోలవరం పూర్తి చేస్తానన్నావు... ఆ తర్వాత 2021 డిసెంబరులో పోలవరం పూర్తి చేస్తానన్నావు... ఇప్పుడు మళ్లీ 2022 జూన్ నాటికి పూర్తవుతుందని అంటున్నావు. రెండేళ్ల క్రితమే డయాఫ్రం వాల్ దెబ్బతిని ఉంటే, దానిపై ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కట్టే పరిస్థితే లేకుంటే ఎందుకు ఈ విషయంపై అసెంబ్లీలో అబద్ధాలు చెప్పావు? ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టించావు?" అంటూ ప్రశ్నించారు. 

నీటి పారుదల అంశాలపై సీఎం జగన్ కు ఎలాంటి అవగాహన లేదని ఎప్పుడో తేటతెల్లమైందని అన్నారు. గతంలో మన గోదావరి జలాలను తెలంగాణ మీదుగా శ్రీశైలం తీసుకువస్తానన్నప్పుడే నిపుణులు ముక్కున వేలేసుకున్నారని నిమ్మల ఎద్దేవా చేశారు. ఇవాళ ఎటువంటి ప్రణాళిక లేకుండా రాష్ట్రాన్నే కాదు, పోలవరాన్ని కూడా ముంచేశాడని విమర్శించారు.
Nimmala Rama Naidu
Polavaram Project
CM Jagan
Andhra Pradesh

More Telugu News