Nirmal District: వీఆర్ఏలకు డ్యూటీల వివాదంపై నిర్మల్ జిల్లా కలెక్టర్ స్పందన ఇదే

- కలెక్టర్ టెన్సిస్ ఆడితే బాల్స్ అందించే విధులు వీఆర్ఏలకు
- ఈ వ్యవహారంపై స్పందించిన కలెక్టర్ ముషరఫ్ అలీ
- తనకేమీ తెలియదని వ్యాఖ్య
- అలాంటిదేమైనా ఉంటే చర్యలు తప్పవని వెల్లడి
కలెక్టర్ టెన్నిస్ ఆడుతుంటే... బంతులను అందించేందుకు వీఆర్ఏలకు డ్యూటీలు వేశారన్న వివాదం తెగ వైరల్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ తాజాగా స్పందించారు. తన దృష్టికి ఈ విషయం రాలేదని చెప్పిన కలెక్టర్.. వీఆర్ఏలకు టెన్నిస్ బంతులు అందించే బాధ్యతలు అప్పగిస్తూ తహసీల్దార్ విడుదల చేసిన జాబితాను చూసి తాను మాట్లాడతానని పేర్కొన్నారు.
నిర్మల్‌లో ప్రారంభమైన తొలి టెన్నిస్ స్టేడియం ఇదేనని, ఇందులో ఎవరైనా ఆడుకునేందుకు వచ్చే వీలుందని అలీ ప్రకటించారు. ఈ క్రమంలోనే వీఆర్ఏలు వచ్చి ఉంటారేమోనన్న ఆయన.. ఇతర శాఖల అధికారులు, సామాన్య ప్రజలు కూడా ఈ కోర్టులో ఆడుకునే వీలుందన్నారు. ఇక వీఆర్ఏలకు విధుల విషయంలో జరిగిన వ్యవహారాన్ని పరిశీలించాక... అవసరమనుకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ తరహా వ్యవహారాలపై ఉన్నతాధికారుల వేధింపులు ఉన్నట్టయితే తనను కలిసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు.