Surya Kumar Yadav: సూర్యకుమార్ వన్ మేన్ షో... ముంబయి గౌరవప్రద స్కోరు

Surya Kumar Yadav flamboyant innings helps Mumbai Indians respectable score
  • పూణేలో ముంబయి వర్సెస్ బెంగళూరు
  • 72 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ముంబయి
  • భారీ షాట్లతో విరుచుకుపడిన సూర్యకుమార్
  • 5 ఫోర్లు, 6 సిక్సర్లు బాదిన వైనం
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించిందంటే అందుకు సూర్యకుమార్ యాదవ్ ఆడిన విధ్వంసక ఇన్నింగ్సే కారణం. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఓ దశలో 72 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ముంబయిని చూస్తే కనీసం 100 పరుగులు సాధిస్తే గొప్ప అనిపించింది. 

కానీ, జయదేవ్ ఉనద్కత్ ను ఓ ఎండ్ లో ఉంచి, మరో ఎండ్ లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగిన వైనం ముంబయి అభిమానులను ఉర్రూతలూగించింది. సూర్యకుమార్ యాదవ్ కేవలం 37 బంతుల్లో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 5 ఫోర్లు, 6 భారీ సిక్సులు ఉన్నాయి. మైదానంలో అన్ని వైపులా భారీ షాట్లు కొట్టిన సూర్య బెంగళూరు బౌలర్లను బెంబేలెత్తించాడు. 

అంతకుముందు, ఓపెనర్లు ఇషాన్ కిషన్ 26, రోహిత్ శర్మ 26 పరుగులు చేసి అవుటయ్యారు. బేబీ డివిలియర్స్ గా పేరుతెచ్చుకున్న దక్షిణాఫ్రికా సంచలనం డివాల్డ్ బ్రెవిస్ 8 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ (0), కీరన్ పొలార్డ్ (0) డకౌట్ కావడంతో ముంబయి కష్టాల్లో పడింది. అయితే, సూర్యకుమార్ యాదవ్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ తో ఆ జట్టు స్కోరు 150 మార్కు దాటింది. బెంగళూరు బౌలర్లలో వనిందు హసరంగ 2, హర్షల్ పటేల్ 2, ఆకాశ్ దీప్ 1 వికెట్ తీశారు.
Surya Kumar Yadav
Mumbai Indians
RCB
Pune
IPL

More Telugu News