Harbhajan Singh: సీఎస్కే కు ఒక్కటి కాదు.. ఎన్నో సమస్యలు: హర్భజన్ సింగ్

  • పవర్ ప్లేలో వికెట్ తెచ్చిపెట్టే బౌలర్ లేడన్న హర్భజన్ 
  • ఆ తర్వాత కూడా వికెట్లు తీసే పేసర్లు లేరని వ్యాఖ్య 
  • ఓపెనింగ్ కూడా బలంగా లేదన్న భజ్జీ 
Harbhajan Singh points out two key reasons behind CSKs struggle in IPL 2022

నాలుగు పర్యాయాలు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత సీజన్ లో సత్తా చూపించలేకపోతోంది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో సీఎస్కే తలపడనుంది. సీఎస్కే ఓటమి వెనుక కారణాలను మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విశ్లేషించాడు.

‘‘వారికి సమస్య ఒక్కటి కాదు రెండున్నాయి. మొదటి ఆరు ఓవర్లలో (పవర్ ప్లే) దీపక్ చాహర్ మాదిరిగా బంతితో వికెట్ తెచ్చిపెట్టే బౌలర్ లేడు. కొత్త బంతితో వేగంగా వికెట్ ను తీయగల సామర్థ్యం చాహర్ కు ఉంది. పవర్ ప్లే తర్వాత 7వ ఓవర్ నుంచి 15వ ఓవర్ వరకు వికెట్లను అందించే స్పిన్నర్లు కూడా లేరు’’ అని హర్భజన్ సింగ్ వివరించాడు. గాయం కారణంగా దీపక్ చాహర్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. త్వరలో వస్తాడన్న అంచనాలు అయితే ఉన్నాయి.

గత సీజన్ లో సీఎస్కే జట్టు టైటిల్ విజయంలో ఓపెనింగ్ ద్వయం రుతురాజ్ గైక్వాడ్, ఫాప్ డూప్లెసిస్ కీలకంగా పనిచేశారు. ఈ విడత ఫాప్ డూప్లెసిస్ ఆర్సీబీ జట్టు సొంతం కాగా.. రుతురాజ్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లోనూ తన ప్రతిభను చాటలేదు. దీనిపై హర్భజన్ స్పందిస్తూ.. ‘‘రుతురాజ్ త్వరగా అవుట్ అవుతుండడంతో బలమైన ఓపెనింగ్ ఉండడం లేదు. కనుక సీఎస్కేకు ఎన్నో సమస్యలున్నాయి. అందుకే చెన్నై ఆడిన మూడు మ్యాచ్ లను కోల్పోయింది. చెన్నై పునరాగమనం చేసి, విజయాలు నమోదు చేస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని పేర్కొన్నాడు.

More Telugu News