lemon: అక్కడ ఒక్కో నిమ్మకాయ రూ.25..!

  • ఉత్తర భారతంలో ధరల మోత
  • కిలో నిమ్మకాయల ధర రూ.400 
  • దక్షిణాదిన రూ.120-150
  • తగ్గిన దిగుబడి.. పెరిగిన వినియోగం
nimbu lemon prices soared

నిమ్మకాయలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. మనదేశంలో నిమ్మ వినియోగం ఎక్కువే. అయినా, దిగుబడి కూడా దండిగా ఉండడంతో కొన్నేళ్ల క్రితం వరకు నిమ్మ ధరలు అందుబాటులో ఉండేవి. ఒక కాయ రూపాయికి కూడా వచ్చేది. కానీ, 2020లో కరోనా వచ్చిన తర్వాత నిమ్మకు మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవాలి.

నిమ్మలో విటమిన్ సి పుష్కలం. ఇది వ్యాధి నిరోధక శక్తిలో కీలకంగా పనిచేస్తుంది. వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉన్న వారిని కరోనా వైరస్ ఏమీ చేయలేదన్న ప్రచారం ఎక్కువ మందిలో ఆరోగ్య రక్షణ పట్ల అవగాహన పెంచేలా చేసింది. ఫలితంగా నిమ్మ వినియోగం పెరిగింది. ఇప్పుడు వేసవి సీజన్ కూడా తోడు కావడంతో నిమ్మకాయలకు డిమాండ్ గణనీయంగా పెరగడంతో వాటి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే వేసవిలో నిమ్మ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది.

దక్షిణాదిన, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వీటి ధరలు కిలోకు రూ.120-150 వరకు చేరాయి. కానీ, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రూ.400 వరకు కిలో పలుకుతోందంటే డిమాండ్ ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. అహ్మదాబాద్ శివారు ప్రాంతంలో ఒక్కో నిమ్మకాయ (పెద్ద సైజు) రూ.25కు పైనే పలుకుతోంది. అహ్మదాబాద్ లోని జోధ్ పూర్, వస్త్రాపూర్ ప్రాంతాల్లో హోల్ సేల్ కిలో ధర రూ.230 ఉంటే, రిటైల్ ధర రూ.400కు చేరింది. గత వారం వరకు టోకు ధర కిలోకు రూ.130గానే ఉండేది. దేవీ వసంత నవరాత్రులు, రంజాన్ మాసం కావడంతో డిమాండ్ పెరిగినట్టు వర్తకులు చెబుతున్నారు. 

గతేడాది నవంబర్, డిసెంబర్ లో వచ్చిన అకాల వర్షాలు నిమ్మ దిగుబడిని దెబ్బతీయడం కూడా ప్రస్తుత ధరల మంటకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ‘‘గుజరాత్ లో నిమ్మకాయల సరఫరా అన్నదే కష్టమైపోయింది. ప్రస్తుతం మేము రోజువారీగా 50 టన్నుల నిమ్మకాయలను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం’’ అని అహ్మదాబాద్ లోని హోల్ సేల్ డీలర్ చిరాగ్ ప్రజాపతి చెప్పారు. రిటైల్ ధరలు మరికొన్ని రోజులు ఆగితే కిలోకు రూ.200కు దిగి రావచ్చని తెలిపారు. 

More Telugu News