Sri Lanka: శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత.. మరింతగా దిగజారిన పరిస్థితి

Sri Lanka President revokes emergency
  • ప్రజల నిరసనలతో దిగొచ్చిన అధ్యక్షుడు
  • గత అర్ధరాత్రి నుంచే ఉపసంహరణ ఉత్తర్వులు అమల్లోకి
  • నార్వే, ఇరాక్‌లోని రాయబార కార్యాలయాలు మూసివేస్తున్నట్టు ప్రకటన
విదేశీ మారక నిల్వలు తరిగిపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక పరిస్థితి రోజురోజుకు మరింతగా దిగజారుతోంది. నిరసనలు తీవ్ర రూపం దాల్చడం, మంత్రుల మూకుమ్మడి రాజీనామాలతో అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన సోదరుడు, ప్రధానమంత్రి మహీంద్ర రాజపక్సను ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీనికితోడు పార్లమెంటులో నిన్న అధికార పార్టీ మెజారిటీ కోల్పోయింది. 

మరోవైపు, దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతుండడంతో దిగొచ్చిన అధ్యక్షుడు దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని రద్దు చేశారు. గత అర్ధరాత్రి నుంచే ఉపసంహరణ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. కాగా, దేశంలో ఆర్థిక పరిస్థితి నానాటికి మరింతగా దిగజారుతోంది. విద్యుత్, పెట్రోలు, డీజిల్, గ్యాస్ వంటివి దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల ధరలు ప్రజలకు అందనంత దూరంలో ఉన్నాయి.

శ్రీలంక ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 నుంచి నార్వే, ఇరాక్‌లోని తమ రాయబార కార్యాలయాలను, ఆస్ట్రేలియాలోని తమ కాన్సులేట్ జనరల్‌ను తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ప్రకటించింది. దేశంలో మందులకు కొరత ఏర్పడడంతో హెల్త్ ఎమర్జెన్సీని కూడా ప్రభుత్వం ప్రకటించింది.
Sri Lanka
Emergency
Economic Crisis
Gotabaya Rajapaksa

More Telugu News