కౌలు రైతులను కులం కోణంలో చూస్తున్నారు: జనసేన నేత నాదెండ్ల ఆరోపణ
- రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన నాదెండ్ల
- కౌలు రైతుల వెతలు మానవీయ సంక్షోభమేనని వెల్లడి
- రైతు ఆత్మహత్యలపై నెల రోజుల్లోగా న్యాయం చేయాలని డిమాండ్
- లేదంటే పవన్ స్వయంగా రంగంలోకి దిగుతారని హెచ్చరిక
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా జగన్ సర్కారు స్పందించడం లేదని నాదెండ్ల ఆరోపించారు. కౌలు రైతులకు కూడా రైతుల మాదిరే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పిన జగన్ సర్కారు.. కౌలు రైతులకు ఇచ్చే గుర్తింపు కార్డులను 5 లక్షలకే పరిమితం చేసిందని ఆయన ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు రూ.7 లక్షల నష్ట పరిహారం ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కౌలు రైతులకు ఎదురవుతున్న సమస్యలను తమ పార్టీ మానవీయ సంక్షోభంగా పరిగణిస్తోందని నాదెండ్ల చెప్పారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు నెల రోజుల్లోగా న్యాయం చేయాలని డిమాండ్ చేసిన నాదెండ్ల.. ప్రభుత్వం స్పందించని పక్షంలో జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగుతారని కూడా హెచ్చరించారు.