ఇది ముమ్మాటికీ వృద్ధాప్యంలో ఉన్న పేదవారి ఉసురుగొట్టుకునే చర్య: బండి సంజయ్
- ఆసరా పింఛన్లపై సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
- వయో పరిమితి తగ్గిస్తున్నట్టు హామీ ఇచ్చారని వెల్లడి
- 11 లక్షల మంది కొత్తగా అర్హులయ్యారని వివరణ
- పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యలు
కుటుంబంలో ఆసరా పింఛను పొందే వ్యక్తి మరణిస్తే, ఆ కుటుంబంలో అర్హులు ఉంటే పింఛను కొనసాగించాలని, అలా కాకుండా ఒక కుటుంబానికి ఒక పింఛను అని నిర్ణయించడం అన్యాయం అని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ వృద్ధాప్యంలో ఉన్నవారి ఉసురుగొట్టుకునే చర్య అని బండి సంజయ్ విమర్శించారు.
2018 డిసెంబరులో ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు కాలేదని, దాంతో గడచిన 39 నెలల్లో ఒక్కో ఆసరా లబ్దిదారుడికి ప్రభుత్వం రూ.78,624 బకాయి పడిందని వివరించారు. ఆ బకాయిలను వృద్ధులకు చెల్లించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని బండి సంజయ్ స్పష్టం చేశారు.