KKR: ఐపీఎల్ హంగామా మొదలైంది... టాస్ గెలిచిన కోల్ కతా

KKR won the toss in the IPL new season inaugural match
  • ముంబయి వాంఖెడే స్టేడియంలో తొలి మ్యాచ్
  • చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్
  • బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా సారథి శ్రేయాస్ అయ్యర్
  • ఇరుజట్లలోనూ మ్యాచ్ విన్నర్లు
ఐపీఎల్-2022 ప్రారంభమైంది. ముంబయి వాంఖెడే స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్ లో నిరుటి విజేత చెన్నై సూపర్ కింగ్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో కోల్ కతా సారథి శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా, ఇరుజట్లలోనూ మ్యాచ్ విన్నర్లు పుష్కలంగా ఉండడంతో హోరాహోరీ తప్పదనిపిస్తోంది. 

చెన్నై జట్టుకు రవీంద్ర జడేజా నూతన సారథిగా అరంగేట్రం చేస్తుండగా, మాజీ సారథి ధోనీ సాధారణ ఆటగాడిగా కొనసాగనున్నాడు. అయితే, ధోనీ వంటి అపార అనుభవజ్ఞుడు అండగా ఉండడం జడేజాకు కలిసొచ్చే అంశం. ఇక, యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, డెవాన్ కాన్వే, రాబిన్ ఊతప్ప, శివమ్ దూబే, జడేజా, ధోనీలతో చెన్నై బ్యాటింగ్ లైనప్ పటిష్ఠంగా కనిపిస్తోంది.

అయితే గతంలో ఫాఫ్ డుప్లెసిస్ వంటి దిగ్గజ ఓపెనర్ ఉండడంతో ఇన్నింగ్స్ కు సరైన ఆరంభం లభించేది. ఈసారి డుప్లెసిస్ లేకపోగా, గైక్వాడ్ కు జతగా ఎవరు బరిలో దిగుతారన్నది ఆసక్తి కలిగిస్తోంది. బౌలింగ్ లో ఆడమ్ మిల్నే, మిచెల్ శాంట్నర్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి.

కోల్ కతా నైట్ రైడర్స్ విషయానికొస్తే... వెంకటేశ్ అయ్యర్, రహానే, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, నితీశ్ రాణా, శామ్ బిల్లింగ్స్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ లతో భారీ బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి, నరైన్, ఉమేశ్ యాదవ్, శివమ్ మావిలపై ఆశలు ఉన్నాయి.
KKR
Toss
CSK
IPL-2022
Wankhede Stadium
Mumbai

More Telugu News