Illegal Contacts: దంపతుల్లో ఒకరు అక్రమ సంబంధం పెట్టుకున్నారని రెండో వారు ఆరోపించడంపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Delhi High Court comments on illegal contacts allegations
  • తప్పుడు ఆరోపణలు చేయడం వ్యక్తిత్వంపై దాడి కిందకు వస్తుంది
  • వ్యక్తి పేరు ప్రతిష్ఠలతో పాటు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది
  • ఇలాంటి ఆరోపణలను క్రూరమైనవిగా న్యాయస్థానాలు పరిగణించాలి
వైవాహిక బంధాలు ఇటీవలి కాలంలో చాలా బలహీనంగా మారుతున్నాయి. తమ జీవిత భాగస్వామిపై ఉన్న అనుమానాలు కూడా బంధాన్ని బలహీనపరుస్తున్నాయి. దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దంపతుల్లో ఒకరు వివాహేతర సంబంధం పెట్టుకున్నారని రెండో వ్యక్తి ఆరోపించడం వ్యక్తిత్వంపై దాడి కిందకు వస్తుందని తెలిపింది. పేరు ప్రతిష్ఠలతో పాటు ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుందని పేర్కొంది. ఆరోగ్యవంతమైన సమాజం కోసం పెళ్లిని ఒక పవిత్రమైన బంధంగా పరిరక్షించాలని తెలిపింది. 

జీవిత భాగస్వామిపై చేసే తప్పుడు ఆరోపణలు తీవ్ర మానసిక వేదనను కలిగిస్తాయని, అందువల్ల ఇలాంటి తప్పుడు ఆరోపణలను న్యాయస్థానాలు క్రూరమైనవిగా పరిగణించి, తగు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఓ కేసును విచారించిన సందర్భంగా కోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. 

కేసు వివరాల్లోకి వెళ్తే... 2014 జూన్ లో దంపతులకు వివాహమయింది. అయితే తన మామగారు తనను లైంగికంగా వేధించారంటూ భార్య క్రిమినల్ కేసు పెట్టింది. ఇది తన భార్య తన పట్ల చేసిన క్రూరమైన చర్య అంటూ భర్త కోర్టులో విడాకుల కోసం అర్జీ పెట్టాడు. అన్ని ఆధారాలను పరిశీలించిన కుటుంబ కోర్టు... భర్తకు అనుకూలంగా 2019 జనవరిలో విడాకులను మంజూరు చేసింది. దీంతో ఫ్యామిలీ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో భార్య సవాల్ చేసింది. 

ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాతే ఫ్యామిలీ కోర్టు తీర్పును వెలువరించిందని చెప్పింది. మామగారి మీద నిరాధారమైన ఆరోపణలను చేయడం ద్వారా... మామ, భర్త పట్ల మానసిక క్రౌర్యానికి భార్య పాల్పడిందని తెలిపింది. వారికి తీరని మనోవేదన కలిగించిన నేపథ్యంలో ఫ్యామిలీ కోర్టు సరైన నిర్ణయం తీసుకుందని చెప్పింది. తన ఆరోపణలను నిరూపించలేకపోయిందని ఆమె అప్పీలును కొట్టేసింది.
Illegal Contacts
Delhi High Court

More Telugu News