Zomato: 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ.. జొమాటో మరో కొత్త ప్రయోగం!

  • త్వరలోనే ప్రారంభించనున్నట్టు ప్రకటన
  • ప్రస్తుతం ఒక్కో ఆర్డర్ డెలివరీకి 30 నిమిషాలు
  • కస్టమర్లు వేగంగా డెలివరీ కోరుకుంటున్నారు
  • ఆవిష్కరణల్లో ముందుంటేనే రాణిస్తామన్న జొమాటో సీఈవో 
Zomato will very soon deliver your food order in just 10 minutes

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ ‘జొమాటో’ తన యూజర్లకు మరింత వేగంగా సేవలు అందించేందుకు ముందుకు వస్తోంది. ఆర్డర్ చేసిన కేవలం 10 నిమిషాల్లోనే ఆహారాన్ని కస్టమర్ కు అందించాలని అనుకుంటోంది. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీలో స్విగ్గీ, జొమాటో 90 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉండడం తెలిసిందే.


జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘జొమాటోపై 10 మినిట్స్ ఫుడ్ డెలివరీ సేవ త్వరలోనే రానుంది’’ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు 10 నిమిషాల్లో డెలివరీ సేవ కేవలం గ్రోసరీ విభాగంలోనే బ్లింకిట్ (గతంలో గ్రోఫర్స్), జెప్టో, స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ఇదే విధంగా 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ ఎందుకు ఆఫర్ చేయకూడదని జొమాటో భావించి ఉంటుంది. 

‘‘బ్లింకిట్ కు తరచూ కస్టమర్ (బ్లింకిట్ లో జొమాటోకు పెట్టుబడులు ఉన్నాయి.. బ్లింకిట్ 10 నిమిషాల గ్రోసరీ డెలివరీ ఆఫర్ చేస్తోంది) కావడంతో.. ఒక్కో ఆర్డర్ డెలివరీకి జొమాటో సగటున తీసుకుంటున్న 30 నిమిషాల సమయం చాలా నిదానం అనిపించింది. కనుక ఎవరో దీన్ని సరిదిద్దే వరకు వేచి చూస్తే నిరుపయోగంగా మారాల్సి వస్తుంది. ఆవిష్కరణలు, ముందుండడం అన్నవి టెక్నాలజీ పరిశ్రమలో నిలిచి రాణించడానికి కీలకం. కనుక జొమాటో ఇన్ స్టంట్ పేరిట 10 నిమిషాల ఫుడ్ డెలివరీ సేవను ఆఫర్ చేయనున్నాం’’ అని గోయల్ చెప్పారు.

జొమాటో మొబైల్ యాప్ పై వేగంగా డెలివరీ చేసే రెస్టారెంట్ల గురించి యూజర్లు శోధిస్తున్నట్టు గోయల్ చెప్పారు. వేగంగా డెలివరీ చేయడం అన్నది కస్టమర్లకు సౌకర్యమే కానీ, డెలివరీ ఏజెంట్లకు కాదన్నారు. ఆహారాన్ని వేగంగా డెలివరీ చేసే విషయంలో డెలివరీ భాగస్వాములపై తాము ఎటువంటి ఒత్తిడి పెట్టబోమన్నారు. వారి భద్రతకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

  • Loading...

More Telugu News