Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందన్న వారికి కొల్లాపూర్ సభే సమాధానం: రేవంత్ రెడ్డి

Revanth Reddy feels very happy after seen huge crowds at Kollapur rally
  • నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో కాంగ్రెస్ సభ
  • మన ఊరు-మన పోరు పేరిట భారీ బహిరంగ సభ
  • వేలమందితో క్రిక్కిరిసిపోయిన సభా ప్రాంగణం
  • జనసందోహాన్ని చూసి రేవంత్ ఉత్సాహం
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో మన ఊరు-మన పోరు పేరిట కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వేలమంది కాంగ్రెస్ కార్యకర్తలతో నిండిపోయిన సభాస్థలిని చూసి రేవంత్ రెడ్డి ఉప్పొంగిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందన్న వారికి కొల్లాపూర్ సభే సమాధానం చెబుతుందని అన్నారు. కొల్లాపూర్ రాజావారి బంగ్లా నుంచి కృష్ణమ్మ పొంగినట్టుగా ప్రజానీకం తరలివచ్చిందని వెల్లడించారు. 

వేలాదిగా తరలివచ్చి కాంగ్రెస్ కు అండగా నిలిచారని, ఎవరు మోసం చేసినా, ఎవరు అన్యాయం చేసినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ ను వెన్నంటే ఉన్నారనడానికి ఇదే నిదర్శనమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ వనపర్తి సభకు, కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ సభకు తేడా చూడాలన్నారు. కొల్లాపూర్ సభా ప్రాంగణానికి చేరుకోవడానికే 10 గంటల సమయం పట్టిందని వెల్లడించారు. 

కాగా, భారీ జనసందోహాన్ని చూసి రేవంత్ రెడ్డిలో ఉత్సాహం పెల్లుబికింది. ఇదే ఉత్సాహంతో 119 నియోజకవర్గాల్లో కాలికి బలపం కట్టుకుని తిరుగుతానని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని, కేసీఆర్ ఈ ఎనిమిదేళ్లలో చేయని పనులన్నీ పూర్తి చేసి తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు.
Revanth Reddy
Kollapur
Congress
Telangana

More Telugu News