Chiranjeevi: ఉక్రెయిన్ లో ఉండిపోయిన ఏపీ డాక్టర్ గురించి చిరంజీవి భావోద్వేగంతో కూడిన ట్వీట్!

Chiranjeevi gets emotional for doctor Giri Kumar who stayed in Ukraine for his jaguar and panther
  • ఉక్రెయిన్ లో మెడిసిన్ చదివి అక్కడే స్థిరపడిన తణుకు వాస్తవ్యుడు గిరికుమార్
  • చిరంజీవి 'లంకేశ్వరుడు' సినిమాతో ప్రేరణ 
  • తాను పెంచుకుంటున్న జాగ్వార్, పాంథర్ కోసం అక్కడే ఉండిపోయిన వైనం
  • గిరికుమార్ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించిన చిరంజీవి
ఉక్రెయిన్ పై రష్యా భయంకర రీతిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. రష్యా దాడికి అక్కడి భవనాలు ధ్వంసమవుతున్నాయి. నగరాలు గుర్తుపట్టలేని విధంగా తయారవుతున్నాయి. మరోవైపు, అక్కడున్న భారతీయులను ఆపరేషన్ గంగా పేరుతో కేంద్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో వెనక్కి తీసుకొచ్చింది. అయినప్పటికీ ఇప్పటికీ అక్కడ ఎంతో మంది భారతీయులు చిక్కుకుపోయారు. కదలలేని పరిస్థితిలో కొందరు, తమకు ఇష్టమైన వాటిని వదిలి రాలేక మరికొందరు అక్కడే ఉండిపోయారు. 

అలాంటి వారిలో ఉక్రెయిన్ లో స్థిరపడ్డ ఏపీలోని తణుకు పట్టణానికి చెందిన డాక్టర్ గిరికుమార్ ఒకరు. ఉక్రెయిన్ లో మెడిసిన్ చదివి అక్కడే డాక్టర్ గా స్థిరపడ్డారు. డాక్టర్ గిరికుమార్ ఇండియాకు తాను రాలేనని ఓ వీడియో ద్వారా పేర్కొన్నారు. దీనికి కారణం.. ఆయన ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న ఓ జాగ్వార్ , ఓ పాంథర్. తాను ఇండియాకు తిరిగొస్తే ఇవి తిండి లేకుండా చచ్చిపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వీటిని వదలేయలేక, వీటి కోసం ఇక్కడే ఉన్నానని చెప్పారు. 

చిరంజీవి నటించిన లంకేశ్వరుడు సినిమా ప్రేరణగా తాను కూడా ఈ మూగజీవాలను పెంచుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఆయన వీడియో ఎందరో హృదయాలను కదిలించింది. మూగ జీవాల కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి అక్కడే ఉండిపోయిన ఆయనకు ఎంతో మంది బరువెక్కిన హృదయాలతో హ్యాట్సాఫ్ చెపుతున్నారు. 

గిరికుమార్ గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి కూడా కదిలిపోయారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ.. 'ప్రియమైన డాక్టర్ గిరికుమార్... జాగ్వార్, పాంథర్ లపై మీకున్న ప్రేమ నన్ను టచ్ చేసింది, నాలో స్ఫూర్తిని నింపింది. ఉక్రెయిన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కూడా ఇండియాకు రాకుండా, వాటి కోసం అక్కడే ఉండాలనుకోవడం నిజంగా హృదయాన్ని హత్తుకునే విషయం. ఈ ఛాలెంజింగ్ సమయంలో మీరు అక్కడ క్షేమంగా, సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. పరిస్థితులు చక్కబడేంత వరకు మీరు క్షేమంగా ఉండాలి. గాడ్ బ్లెస్' అని ట్వీట్ చేశారు.
Chiranjeevi
Tollywood
Doctor Giri Kumar
Ukraine

More Telugu News