NV Prasad: ఈ జీవో 'భీమ్లా నాయక్' విడుదలకు ముందు ఇస్తే చాలా బాగుండేది: ఎన్వీ ప్రసాద్

NV Prasad opines on AP govt decision over cinema tickets prices
  • ఏపీలో సినిమా టికెట్లపై కొత్త జీవో
  • ధరల సవరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • ఫిలించాంబర్ లో సినీ ప్రముఖుల మీడియా సమావేశం
  • సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన సినీ పెద్దలు
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం కొత్త జీవో ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఫిలించాంబర్ లో సినీ ప్రముఖులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిలిం చాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం అని పేర్కొన్నారు. పెద్ద సమస్యను ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. 

కరోనా సంక్షోభం కంటే జీవో నెం.35తోనే డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ సతమతం అయ్యారని ఎన్వీ ప్రసాద్ అన్నారు. అయితే, తాజాగా జారీ చేసిన జీవో ఎంతో సంతృప్తికరంగా ఉందని అన్నారు. ఇదే జీవో భీమ్లా నాయక్ విడుదలకు ముందే ఇచ్చి ఉంటే చాలా బాగుండేదని ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఇక పరిశ్రమలోని చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటామని తెలిపారు. పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి చిరంజీవిది కీలకపాత్ర అని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు స్నేహపూర్వక ప్రభుత్వాలు అని అభివర్ణించారు. 

నిర్మాతల మండలి అధ్యక్షుడు   సి.కల్యాణ్ మాట్లాడుతూ, వివాదాలకు తెరదించేలా సినిమా టికెట్ల ధరలపై జీవో ఇవ్వడం సంతోషదాయకం అని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ఏపీ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. విశాఖలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలన్నది సీఎం కోరిక అని కల్యాణ్ తెలిపారు. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై ఫిలించాంబర్ మరోసారి సమావేశం అవుతుందని చెప్పారు. త్వరలో సీఎం జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతామని వివరించారు. 

సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, తమ వినతులు కొన్ని అమలు చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మిగతా సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
NV Prasad
Cinema Tickets
Prices
G.O
Bheemla Nayak
AP Govt

More Telugu News