West Bengal: వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో బెంగాల్‌కు మమత.. భారీ కుదుపులకు గురైన విమానం

Mamata Banerjees Flight Faces Mid Air Turbulence
  • ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ప్రచారానికి వెళ్లిన మమత
  • వారణాసి నుంచి తిరిగి వస్తుండగా ఘటన
  • డీజీసీఏ నివేదిక కోరిన బెంగాల్ ప్రభుత్వం
  • భారీ కుదుపుల కారణంగా మమతకు వెన్నునొప్పి
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం ముగించుకుని వారణాసి నుంచి తిరిగి వస్తుండగా మమతా బెనర్జీ విమానం మార్గమధ్యంలో భారీ కుదుపులకు గురైంది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో విమానం సురక్షితంగా కోల్‌కతా విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానం గాల్లో కుదుపులకు గురికావడంపై స్పందించిన బెంగాల్ ప్రభుత్వం.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ను నివేదిక కోరింది. మమత ప్రయాణించే మార్గానికి ముందస్తు అనుమతి ఉన్నదీ, లేనిదీ ఆరా తీసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ తరపున ప్రచారానికి వెళ్లిన మమత శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలపై తాము దర్యాప్తు చేస్తామని, ముఖ్యంగా వీవీఐపీల విషయంలో అధిక ప్రాధాన్యం ఇస్తామని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నివేదిక సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

కాగా, విమానం ఒక్కసారిగా కుదుపులకు గురికావడంతో మమత వెన్నునొప్పికి గురయ్యారు. మమత ప్రయాణించిన విమానం  డసాల్ట్ ఫాల్కన్ 2000. ఇది 10.3 టన్నుల బరువుండే తేలికపాటి విమానం. ఇద్దరు విమాన సిబ్బంది సహా 19 మంది ఇందులో ప్రయాణించే వీలుంటుంది. కాగా, విమానం భారీ కుదుపులకు గురి కావడంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
West Bengal
Mamata Banerjee
Flight
DGCA

More Telugu News